
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మంగళవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్‌రూమ్ వేదికగా రాహుల్‌గాంధీ సమక్షంలో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు.
ఈ మేరకు సమావేశానికి హాజరు కావాలని ఏఐసీసీ నుంచి ఆహ్వానం అందడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా సోమవారమే హస్తిన బాట పట్టారు. కాగా, గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ మారవద్దని, పార్లమెంటు ఎన్నికల అనంతరం పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, అందరూ కలిసికట్టుగా వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిచేలా పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.