సాక్షి, హైదరాబాద్: ప్రజలను మోసం చేసి పాలిస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ ఉపనేత జె.గీతారెడ్డి ఆరోపణలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగించి తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేశారని, రాష్ట్రం బాగుందని చెప్పేందుకు అప్పులను రెవెన్యూగా చూపించారని దుయ్యబట్టారు.
మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ మరో ఉపనేత జీవన్‌రెడ్డితో కలసి గీతారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం అధీనంలోని ఉదయ్ పథకం కింద డిస్కంలకు రూ.9 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.7,500 కోట్లు ఇచ్చారని.. మిగిలిన మొత్తాన్ని గ్రాంటుగా కాకుండా ఈక్విటీగా చూపారన్నారు. హడ్కో నుంచి రూ.1,000 కోట్ల రుణం తీసుకుని దాన్నీ రెవెన్యూగా చూపించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని, ఇలాంటి నేరాలు చేస్తే ప్రైవేటు వ్యక్తులను జైలుకు పంపుతారని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. అప్పులు చేయడానికి తప్పుడు లెక్కలు చూపించారని.. సంక్షేమానికి నిధులివ్వని ఈ ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు క్షమించవన్నారు. ప్రాజెక్టుల వద్దకు ఎవరో ఒకరిని తీసుకెళ్లి హరీశ్ మార్కెటింగ్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment