సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘కేసీఆర్ కిట్’పథకం ప్రభుత్వం చెప్పుకొంటున్నంత గొప్పగా ఏమీ లేదని మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత జె.గీతారెడ్డి వ్యాఖ్యానించారు. పథకం అమల్లోని ఉద్దేశాన్ని అభినందిస్తూనే.. లోపాలు, ప్రభుత్వ విపరీత ప్రచారంపై సెటైర్లు వేశారు. కేసీఆర్ కిట్ పథకంపై శుక్రవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో గీతారెడ్డి కాంగ్రెస్ తరఫున మాట్లాడారు. ప్రభుత్వం చెప్పుకొంటున్నంత గొప్పగా కేసీఆర్ పథకం పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏమీ లేదన్నారు. అసలు ఈ తరహా పథకం ఇదే తొలిసారి కాదని, గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా అమలుచేసిందని చెప్పారు. తమిళనాడులో ముత్తులక్ష్మి పేరిట ఉన్న పథకాన్నే ఇక్కడ కొనసాగిస్తున్నారని, ఇందులో పీఎంఎంవీవై కింద కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం ఉందని వివరించారు.
ఈ పథకం అమల్లోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో 93,927 ప్రసవాలు జరిగాయని లెక్కలు చెబుతున్నారని.. అలాంటప్పుడు 91,148 కిట్లే ఎలా పంపిణీ చేశారని, మిగతావి ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్న లెక్కలు బాగానే ఉన్నా.. అరకొర సౌకర్యాలతో సమస్యల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఖమ్మం ఆసుపత్రిలో ఓ మహిళకు టేబుల్‌పై డెలివరీ చేయగా.. శిశువు కింద పడి చనిపోయిన ఉదంతం దేనికి నిదర్శనమని నిలదీశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ ఆస్పత్రికి ఓ గర్భిణి ప్రసవం కోసం వెళితే బెడ్లు లేవని పంపేశారని.. నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు డెలివరీ జరిగి బిడ్డ చనిపోయిందని గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఒక గుడ్డు ఎక్కువిస్తున్నారు అంతే!
పలు ప్రభుత్వ పథకాలపై గీతారెడ్డి వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. అలాంటి పథకాలను కాంగ్రెస్ చాలా తీసుకొచ్చిందని.. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి స్వయం సహాయక రుణాలిచ్చిందే తామని గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ అమృతహస్తం కింద అంగన్‌వాడీల్లో పథకాలు పెట్టామని.. అయితే ఇప్పుడు ఓ గుడ్డు ఎక్కువ ఇస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళా కమిషన్ వేయలేదని, సమైక్యాంధ్రకు చెందిన వ్యక్తి తెలంగాణ మహిళా కమిషన్‌ను నడిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 6గురు మహిళా మంత్రులు ఉంటే అందులో ఐదుగురం తెలంగాణ వారమని.. ఇప్పుడు ఒక్క మహిళ కూడా మంత్రివర్గంలో లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఆస్పత్రులను మెరుగుపర్చండి
కేసీఆర్ కిట్ పథకం మంచిదే అయినా.. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని ఇతర విపక్షాలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. సొమ్ము కేంద్రానిది అయితే, సోకు రాష్ట్రానిది అన్నట్లుగా పరిస్థితి ఉందని, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 1,243 కేసీఆర్ కిట్లు మాత్రమే ఎందుకు పంపిణీ చేశారని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. బడ్జెట్‌లో కేసీఆర్ కిట్ పథకాన్ని పెట్టలేదని.. అలాంటప్పుడు ఈ పథకం కోసం ఇస్తున్న నిధులను ఏ అంశం నుంచి తగ్గించి ఇస్తున్నారో చెప్పాలని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కోరారు. ప్రసవాలకు అవకాశమున్న ఆరోగ్య కేంద్రాల్లో 5,118 వైద్య పోస్టులు ఉండగా.. 3,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మరి ప్రసవాల సంఖ్య ఎలా పెంచుతారని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య నిలదీశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క వైద్య పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో పరిస్థితిని మెరుగుపర్చాలని ఎంఐఎం సభ్యుడు మొజంఖాన్ కోరారు.
ఏపీకి తెలంగాణ స్ఫూర్తి: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా దాని పేరు మార్చి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అన్నారు. గురువారం కేసీఆర్ కిట్ పథకంపై శాసనసభలో జరిగిన లఘు చర్చను ఆమె ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు. ఇక్కడ ఒక పథకం ప్రవేశపెడితే, అదే తరహాలో అక్కడ కూడా మరో పథకాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబంలో మేనమామ, తాత, అన్న అనే కోణాల్లో ఆలోచించిన సీఎం కేసీఆర్ తెలంగాణ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఆమె ప్రశంసించారు. ఆ తర్వాత మరో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం గిరిజన మహిళలకు ఎంతో ఉపయుక్తంగా మారిందని అన్నారు.
సిజేరియన్లు రాష్ట్రంలోనే ఎక్కువ: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సిజేరియన్లు మన రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలను పెంచి ఆపరేషన్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సహజ ప్రసవాలను పెంచేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మిడ్ వైఫరీ కోర్సును ప్రారంభించామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కేసీఆర్ కిట్ పథకంపై జరిగిన స్వల్ప చర్చలో మంత్రి మాట్లాడారు. ‘మాతృత్వ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్), నవజాత శిశువుల మరణాల నిష్పత్తి (ఐఎంఆర్) తగ్గించడం.. గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ, వేతన కష్టాలను తీర్చడం, ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాన్ని తయారు చేయడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ కిట్ పథకం అమలవుతోంది.ఈ ఏడాది జూన్ 2న కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 93,927 కాన్పులు జరిగాయి. ’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment