అధికారముందని విర్రవీగితే పరాభవమే
బీజేపీకి ఢిల్లీలో పట్టిన గతి టీఆర్‌ఎస్‌కు తప్పదు
టీఆర్‌ఎస్‌కు ఏఐసీసీ నేత కుంతియా హెచ్చరిక
హైదరాబాద్: అధికారం ఉందని అహంభావంతో విర్రవీగితే ప్రజల చేతుల్లో పరాభవం తప్పదని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా హెచ్చరించారు. సచివాలయం, ఛాతీ ఆసుపత్రిని మార్చొద్దంటూ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసుల చేతిలో గాయపడిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డితో కలసి కుంతియా మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ప్రకారం గాంధేయమార్గంలో ర్యాలీని ప్రారంభిస్తే పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం కిరాతకంగా దాడి చేయడం గర్హనీయమన్నారు. దీనికి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరిస్తే ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశ రాజధానిలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందని కుంతియా అన్నారు. ఢిల్లీలో 15 ఏళ్లపాటు వరుసగా అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత వల్లే ఓడిపోయామని వివరించారు. అధికారంలోకి వస్తామన్న బీజేపీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదంటే 8 నెలల్లోనే ఆ పార్టీపై వచ్చిన వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. ఈ ప్రజాతీర్పును తెలంగాణరాష్ట్రంలో టీఆర్‌ఎస్ కూడా గమనంలో ఉంచుకుంటే మంచిదని హితవు పలికారు.
తప్పులు చేయొద్దంటే దాడిచేస్తారా: పొన్నాల
సచివాలయం మార్చడం, ఛాతీ ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించడం వంటి తప్పులు చేయొద్దంటూ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో ప్రభుత్వం దాడి చేయించిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రజల ఆగ్రహాన్ని, కాంగ్రెస్ ఉద్యమాలను కట్టడి చేయలేరని హెచ్చరించారు. మొన్నటిదాకా తెలంగాణకోసం టీఆర్‌ఎస్ చేసిన ఉద్యమాలకు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎంతో సహకరించామని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ను ప్రజాకోర్టులోనే నిలదీస్తామని హెచ్చరించారు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ- కిరణ్‌బేడీ ఎన్నికల్లో జోడీ కట్టినా ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా బీజేపీ యూ-టర్న్ తీసుకున్నదన్నారు.