ఏపీఎన్జీవోల సభకు అభ్యంతరం లేదు: మంత్రి గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడానికే ఒప్పుకున్న వాళ్లం... ఏపీ ఎన్జీవోలు సభలు పెట్టుకోవడానికి ఎందుకు అభ్యంతరం చెబుతామని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. శాంతియుతంగా ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే, శాంతిభద్రతల పరిస్థితిని బట్టి సభకు అనుమతి ఇచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. గీతారెడ్డి నివాసంలో బుధవారం జరిగిన ఒక శుభకార్యానికి పలువురు తెలంగాణ ప్రాంత మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలు హాజరయ్యారు. అదే సందర్భంగా తాజా పరిణామాలపై ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, బసవరాజు సారయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ అనిల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, ఇతర నేతలతో కలసి గీతారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ ఏడో తేదీన ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామంటున్నారని విలేకరులు ప్రస్తావించగా... శాంతియుతంగా ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని బదులిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో నేతలు, ప్రజలు సంయమనం పాటిస్తున్నారని.. కోస్తా, సీమ ప్రాంతంలోనూ నేతలు, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం మేరకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణనే కావాలని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించబోమని స్పష్టంచేశారు.
ఇరుప్రాంతాల ఉద్యోగుల మధ్య దాడులు మంచిది కాదని హితవు పలికారు. అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలని ప్రార్థిస్తూ గురువారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండలంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులందరితో పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో గ్రామస్థాయి నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులు, పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.