
ఏపీఎన్జీవోలు మిలీనియం మార్చ్ అవసరం లేదు: గీతారెడ్డి
తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండడం వల్లే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతమైందని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం కరీంనగర్ విచ్చేసిన ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సభ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేసిన ఘటన దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. గాయపడిని కానిస్టేబుల్ను టి.మంత్రులు పరామర్శిస్తామని తెలిపారు.
అయితే నిజాం కాలేజీలో పోలీసుల లాఠీచార్జీ ఘటన బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి ఉన్నారని గీతారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలో తెలంగాణపై కేబినెట్ నోట్ తయారవుతుందని తెలిపారు. ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేవ్ సభ విజయవంతమైందని సంబర పడుతూ మరో సభ పెట్టాలని చూడటం సరైన చర్య కాదని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకుంటే ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ నేపథ్యంలో గీతారెడ్డిపై విధంగా స్పందించారు.