‘అట్లా’లజిస్ట్ డాక్టర్ రాంబాబు!
నవ్వింత: డాక్టర్ కావాలన్నది మా రాంబాబు గాడి కోరిక. అయితే, మినపట్లలాంటి హెవీ ఫుడ్డు తినేసి, బద్ధకంగా పడుకునేవాడు. అలా మెడిసిన్‌లో చేరలేకపోయాడు. అత్తెసరు మార్కులతో పీజీ గట్టెక్కించాక, డాక్టరేటైనా తెచ్చుకుందామనుకున్నాడు.‘తెలుగు సాహిత్యానికి అట్ల సేవ- తులనాత్మక పరిశీలన’ వాడి టాపిక్కు. ‘‘ఇదేం టాపిక్కురా?’’ అన్నందుకు లెక్చర్ మొదలెట్టాడు. ‘‘అట్టు గురించి వాళ్లూ వీళ్లూ చెప్పడం ఎందుకు? శ్రీశ్రీ, ఆరుద్ర, వరద రాజేశ్వరరావు అట్ల మీద టన్నులకొద్దీ అభిమానాన్ని వెల్లడించారు.
ఆరుద్రగారి కుటుంబం ఉన్న వీధి నుంచి అబ్బూరి రామకృష్ణారావు మాష్టారు వాల్తేరుకు మకాం మార్చినా... వరద రాజేశ్వరరావు రోజూ పొద్దున్నే జట్కా బండి కట్టుకుని మరీ ఆరుద్రవాళ్ల వీధికి విచ్చేసి వాళ్ల బాబాయి (ఆరుద్ర తండ్రిగారి రెండో తమ్ముడు భాగవతుల నారాయణరావు)ని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయేవారట. నలభై ఏళ్ల తర్వాత మళ్లీ వరద రాజేశ్వరరావును హైదరాబాద్‌లో ఆరుద్ర కలిసినప్పుడు తెలిసిందట... వాళ్లు విశాఖపట్నంలోని పప్పుల వీధి మెయిన్‌రోడ్డుకు వెళ్లి ఉల్లికారంతో పెసరట్లు తినేవారని. అక్కడ మూడు రకాల అట్లు వేసేవారట. పెసరట్టు పిండి కొంతా, పుల్లట్ల పిండి కొంతా కలిపి మరో ప్రత్యేకమైన అట్టు వేసేవారు. ఆ రుచిని మరవలేక వరదగారూ, అబ్బూరి ఛాయాదేవిగారూ బాగా ప్రాక్టీస్ చేసి ఉల్లికారాన్ని శ్రీశ్రీకీ, ఆరుద్రకూ పెడితే, వాళ్లు కడుపునిండా తినేసి, పద్యాలు రాసేవారట’’ అన్నాడు రాంబాబు.
‘‘నిజమా?’’ అని అడిగాన్నేను. ‘‘ఇంకా అయిపోలేదు ఆగు... శ్రీశ్రీగారైతే ‘ఈ విశాలవిశ్వంలో నే కోరేడిదేమున్నది ఒక ‘దోసె’డు తీరుబాటు, ఒక పిడికెడు సానుభూతిని’ అంటూ ‘కరుణకు మా బతుకు’ కవిత్వం రాశార్ట. ఇక ఆ రోజుల్లో ఛాయాదేవి గారి ‘కవిత’ పత్రికకు పద్యాలు రాయాడానికి ముందుగా విధిగా పెసరట్టూ, ఉల్లికారం తిన్నాననీ, ఆ తర్వాతే తాను రాసి తొలిసారి ‘కవిత’లో ప్రచురితమైన భాగాలనే... ‘సినీవాలి’లో చేర్చుకున్నాననీ అన్నారు ఆరుద్ర. అంతేనా... ‘హైదరాబాద్‌లోని వరద రాజేశ్వరరావు ఇల్లు ప్రతి రోజూ పొద్దుటే విశాఖపట్నంలోని పప్పుల వీధి పెసరట్ దుకాణం అవతారం దాల్చేది’ అంటూ విశాఖకూ, హైదరాబాద్‌కూ ఉన్న సంబంధం అట్ల సంబంధమేనని తేల్చేశారు ఆరుద్ర.
ఈ మాటల్ని బట్టి నీకు తెలిసేదేమిటీ? పద్యాలు రాయడానికి ముందు పెసరట్లు తినాలని’’ అన్నాడు రాంబాబు. ‘‘ఏదో మహానుభావులు తమ టేస్టుల గురించి చెబితే వాళ్ల సాహిత్యానికి మూలం అట్లే అని తేల్చేస్తే ఎలారా?’’‘‘కాస్త చెప్పడమేంట్రా... ‘వరద జ్ఞాపకాల వరద’ వ్యాసంలో సాహిత్యచర్చ ఎంత ఉందో... అట్ల గురించిన చర్చా అంతే ఉంది.’’ ‘‘ఆ ముగ్గురూ ఇష్టపడ్డారని, సాహిత్యానికి అట్లు సేవ చేశాయంటే ఎలారా?’’ అన్నాన్నేను. ‘‘శ్రీశ్రీకి యోగ్యతాపత్రం ఇవ్వగలిగిన చలం సైతం నూరేళ్ల కిందటే ‘అట్లపిండి’ కథ రాశారు. ‘సదరు అట్లపిండి గిన్నెను ఇంట్లో ఉంచితే నూరు ఖూనీలు జరిగాయేమోనని పొరుగువాళ్లు అనుమానించారట. అట్ల గిన్నెను శ్మశానంలో నిలువులోతున గుంటతవ్వి పాతిపెడితే దెయ్యాలన్నీ ఊరిమీద పడ్డాయంటూ జిల్లా కలెక్టరుకూ, ఛైర్మన్‌కూ అర్జీలు వెళ్లాయట...’ ఆ కథ అందరినీ అట్లు తిన్నట్లుగా కడుపుబ్బా నవ్వించేసింది. అట్లపిండిని ఫ్రిజ్జులో దాచుకునే నాకు... ఎప్పుడు దాని తలుపు తెరిచినా చలంగారు అందులోనే కొలువున్నట్టు అనిపిస్తుంటారు’’ అన్నాడు.
‘‘నలుగురైదుగురు పెద్దవాళ్లు అట్లగురించి మాట్లాడితే సాహిత్యమంతా అట్లమయమేనని ఎలా అంటావురా?’’ ‘‘చిన్న పిల్లలు పాడుకునే ‘చెమ్మచెక్కా... చారడేసి మొగ్గా... అట్లు పోయంగా’లోనూ అట్ల ప్రస్తావన ఉంది. ఇక ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్... ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ మన సంస్కృతిలోనూ అట్ల పండగలు ఉన్నాయి. అట్లతద్ది చేసుకునే అమ్మాయిలకు ఆరు అట్లు చెందాలనీ, ముద్దపప్పుల్లాంటి మగవారికి మూడే అట్లనే విధంగా వ్యాఖ్యానించుకుంటే ఫెమినిస్టు భావాలూ మనకు గోచరిస్తాయి. ఆ మాటకొస్తే కాళ్లకూరి వారు సంస్కరణోద్యమంలో భాగంగా రాసిన చింతామణిలోనూ సుబ్బిశెట్టి చేత అట్లు పోయిస్తారు. ‘శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఎట్లాంటిదో... తన చేతిలో అట్ల పళ్లెం అసుమంటిది’ అనిపించారంటే ఇకనైనా అట్ల గొప్పదనం గురించి నువ్వు ఒకప్పుకోక తప్పదురా’’ అన్నాడు.
‘‘సాహిత్యంలో అట్లు ఇంతగా ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాన్రా’’ అన్నాను. ‘‘అట్ల పట్ల అపార గౌరవంతోనే జంధ్యాలగారు పేరుకు అది ‘వివాహభోజనంబు’ అయినా ‘అట్టు... మినపట్టు, పెసరట్టు, మసాలా అట్టూ...’’ అంటూ అన్ని పేర్లనూ సుత్తి వీరభద్రరావుతో చెప్పించి అట్టును సముచితంగా సత్కరించారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో ఒకరోజున నా పరిశోధనకు గుర్తింపు లభించిన నాడు ఆ న్యూస్ అట్టుడికినట్టు వ్యాపిస్తుంది చూడూ’’ అంటూ పెనంపై అట్టు తిరగేసినట్టుగా గబుక్కున వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు రాంబాబు.
- యాసీన్