చెన్నై: బతికి ఉన్నపుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా మనం నలుగురికీ ఉపయోగపడాలంటే అవయవ దానం చేయాలంటారు. ఆత్మీయులను శాశ్వతంగా దూరం చేసుకున్నా.. వారి అవయవాలను దానం చేయడం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఈ మాటలను అక్షరాలా పాటించి చూపించింది ఓ మహిళ. బ్రెయిన్ డెడ్ అయిన తన భర్త అవయవాలను దానం చేసేందుకు అంగీకరించి పెద్ద మనసు చాటుకుంది. ఆమె నిర్ణయం వల్ల ఓ కోవిడ్ పేషెంట్‌కు పునర్జన్మ లభించగా.. మరో యువతికి కృత్రిమ చేతుల వాడకం నుంచి విముక్తి లభించింది. వివరాలు.. చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన 34 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యింది. (చదవండి: పది గంటలపాటు గ్లౌజులు ధరిస్తే.. )
ఈ క్రమంలో అవయవదానం గురించి అతడి భార్యకు అవగాహన కల్పించడంతో.. మృతుడి గుండె ఊపిరితిత్తులు, చేతులు, చర్మం, కాలేయం దానం చేసేందుకు గురువారం సమ్మతించింది. ఈ నేపథ్యంలో.. ఆరేళ్ల క్రితం ఓ రైలు ప్రమాదంలో చేతులు కోల్పోయిన యువతి కోసం ముంబైకి చేతులు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. అదే విధంగా ఊపిరితిత్తులు పాడైపోయిన ఓ కోవిడ్ పేషెంట్ కోసం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి లంగ్స్ ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆసియాలోనే తొలిసారిగా ఓ కరోనా పేషెంట్‌కు అవయవ మార్పిడి చేసి వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు.(చదవండి: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!)
ఈ విషయం గురించి ఎంజీఎం ఆస్పత్రి కార్డియాక్ సైన్సెస్ చైర్మన్, హర్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కేఆర్ బాలక్రిష్ణన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గురుగ్రామ్‌కు చెందిన ఓ 48 ఏళ్ల వ్యాపారవేత్తకు కరోనా సోకినట్లు జూన్ 8న నిర్ధారణ అయ్యింది. వైరస్ ధాటికి అప్పటికే అతడి ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆరోగ్యం విషమించడంతో ఎక్మో ట్రీట్‌మెంట్ కోసం అతడిని జూలైలో ఇక్కడికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే వాళ్లను సంప్రదించి ఊపిరితిత్తులను సేకరించాం. ఆగష్టు 27న వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అవయవ మార్పిడి చేశారు. ప్రస్తుతం అతడు కరోనా నుంచి కోలుకున్నాడు. ఊపిరితిత్తులు బాగానే పనిచేస్తున్నాయి. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది’’అని వెల్లడించారు.( చదవండి.. కరోనా: ఆరు ఫీట్ల దూరం పాటిస్తే సరిపోదు!)
బ్రెయిన్‌డెడ్‌ను ఎలా నిర్ధారిస్తారు?
ప్రమాదం వల్లగాని, నివారణకాని వ్యాధి వల్లగాని అపస్మారకస్థితిలోకి చేరుకున్న మనిషికి... కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృహలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్‌గా పేర్కొంటారు. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలున్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతోపాటు సదరు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తుల కుటుంబ సభ్యులు లేదా బంధువులను అవయవదానానికి ఒప్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment