మద్రాస్ హైకోర్టు(ఫైల్ ఫొటో)
సాక్షి, ప్రతినిధి, చెన్నై: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆంక్షలు అమల్లోకి తెచ్చినా రాష్ట్రంలో కరోనా కట్టలు తెంచుకుంది, తమ అదుపు దాటిపోయిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ మద్రాసు హైకోర్టులో వాంగ్మూలం ఇవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. రాష్ట్రంలో గురువారం రాష్ట్రం మొత్తం మీద 7,946, చెన్నైలో 2,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చెన్నై తరువాత 18 జిల్లాల్లో కరోనా తీవ్రస్థాయిలో కోరలు చాస్తోంది. రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ అదుపులేకుండా వ్యాపిస్తోందని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ మద్రాసు హైకోర్టుకు వివరించారు. అదే స్థాయిలో కట్టడి చర్యలను కూడా తీవ్రతరం చేశామని చెప్పారు. రాష్ట్రంతోపాటు మద్రాసు హైకోర్టు ప్రాంగణంలో చేపట్టిన చర్యలు ఏమిటో వివరించాలని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించగా, ఆ వివరాలు తెలిపేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని పంపుతానని బదులిచ్చారు.
మితిమీరిన విశ్వాసం కూడదు:
కరోనా వైరస్ తమకు సోకదనే మితిమీరిన విశ్వాసం ఎంతమాత్రం కూడదు, అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రముఖ హాస్యనటుడు వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. డాక్టర్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో భయం వద్దు, అలాగని నిర్లక్ష్యం కూడా ప్రమాదకరమని అన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారంతా విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కూడా ఆంక్షలు పాటించడం అవసరమన్న సంగతిని గుర్తించాలని కోరారు. వ్యాక్సిన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మరాదు, సైడ్ ఎఫెక్ట్స్ రావని అన్నారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆసక్తి చూపకపోవడం ఆందోళనకరమన్నారు. డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ కరోనా నుంచి కోలుకుని గురువారం డిశ్చార్జ్‌కాగా, కోశాధికారి టీఆర్ బాలు కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరారు.
చెన్నైలో కంట్రోలు రూములతో పర్యవేక్షణ:
చెన్నైలో కరోనా కేసులను ముందుగానే గుర్తించేందుకు కంట్రోలు రూములను ఏర్పాటు చేయనున్నారు. కరోనా కేసుల కట్టడికి చెన్నై కార్పొరేషన్ మొత్తం 15 మండలాల్లో కంట్రోలు రూములను ఏర్పాటు చేయనుంది. కరోనా లక్షణాలున్న వారిని, పాజిటివ్ రోగులను ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలించేలా ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ ప్రత్యేక బృందం చెన్నై రిప్పన్ బిల్డింగ్‌లో ఉంటూ కంట్రోలు రూములను పర్యవేక్షిస్తుంది. చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రులు కరోనా రోగులతో దాదాపుగా నిండిపోయాయి. ప్రయివేటు ఆస్పత్రులు సైతం పేషెంట్లతో నిండిపోతున్నాయి.
36 విమానాలు రద్దు..
కరోనా కేసుల పెరుగుదలతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో గురువారం 36 డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేశారు.
నేడు సీఎస్ అత్యవసర సమావేశం:
కరోనా కేసుల కట్టడికై మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. అందుకే ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలనే కఠినతరం చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి సూచనలు, సలహాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ శుక్రవారం ఉదయం చెన్నై సచివాలయంలో వైద్య, ఆరోగ్య, పోలీస్‌శాఖల ఉన్నతాధికారులతో సమావేశం అవుతున్నారు. జనజీవితానికి ఇబ్బందులు లేకుండా కట్టడి చర్యలను తీసుకొచ్చేలా చర్చించనున్నారని సమాచారం.
వారి శవం వీరికి..వీరి శవం వారికి..
కరోనా మరణించిన వారి మృతదేహాలంటేనే ప్రజలకు వణుకు. అలాంటి కరోనా నిర్ధారణ కాని వ్యక్తి మృతదేహాన్ని వేరే కుటుంబ సభ్యులకు, కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మరో కుటుంబ సభ్యులకు అప్పగించిన చిత్రమైన ఉదంతం కడలూరులో చోటుచేసుకుది. కడలూరు జిల్లా భువనగిరికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 13వ తేదీ రాత్రి మృతిచెందాడు. అదే జిల్లా పుదుపేట్టైకి చెందిన 51 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో అదే ఆస్పత్రిలో మరణించాడు. 60 ఏళ్ల వృద్ధుడి శవాన్ని బుధవారం ఉదయం కుటుంబీకులకు అప్పగించగా ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం అంతిమ సంస్కారం ముగించారు. బుధవారం సాయంత్రం 51 ఏళ్ల వ్యక్తి శవాన్ని పత్రాలతో సహా బంధువులకు అప్పగించారు.
శవాన్ని ఇంటికి తీసుకెళ్లి పరిశీలించగా పత్రంలో పేర్కొన్న వివరాలు శవానికి చుట్టి ఉన్న ప్లాస్టిక్ కవర్‌పై లేకపోవడంతో ఖిన్నులైనారు. ఆస్పత్రికి వచ్చి శవం మారిన సంగతి వైద్యులకు చెప్పి ఘర్షణపడ్డారు. బుధవారం ఉదయం వచ్చిన వారి నుంచి శవాన్ని తిరిగి ఇప్పించాలని వాదులాటకు దిగారు. అయితే, కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీయలేమని నిరాకరించారు. 51 ఏళ్ల వ్యక్తికి పాజిటీవ్ నిర్దారణ కానందున పూడ్చిన శవాన్ని బయటకు తీసినా ప్రమాదం లేదని ఆరోగ్యశాఖాధికారులు నచ్చజెప్పారు. ఖననం చేసిన శవాన్ని బయటకు తీసి బంధువులకు అప్పగించి, రెండో శవాన్ని అతడి కుటుంబ సభ్యులకు స్వాధీనం చేయడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment