టెక్కీని కాపాడింది కానీ జయను...
టెక్కీని కాపాడింది కానీ జయను...
Published Tue, Dec 13 2016 2:37 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
బెంగళూరు : కార్డియాక్ అరెస్టుకు గురై అసువులు బాసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చివరి ఘడియల్లో అందించిన ఎక్మో చికిత్స, ఓ టెక్కీ ప్రాణాలను కాపాడగలిగింది. అకస్మాత్తుగా తీవ్ర జ్వరంతో ఐసీయూ చేరిన 43 ఏళ్ల శ్రీనాథ్కు ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి ఇలా అయ్యే సరికి కుటుంబసభ్యులకు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ వెంటనే స్పందించిన డాక్టర్లు, ఇటీవలే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన ఎక్మో చికిత్సను టెక్కీకి అందించారు. దీంతో శ్రీనాథ్ గుండెను 24 గంటల లోపల తిరిగి మామూలు స్థాయికి చేరుకునేలా చేశారు. జయలలితకు, ఇప్పుడు శ్రీనాథ్కు అందించిన ఎక్మో చికిత్సలో ఓ యంత్ర పరికరం ద్వారా రక్తాన్ని పేమెంట్ శరీరంలోకి ప్రవహించేలా చేశారు. కార్బన్డయాక్సైడ్ను బయటికి తీస్తూ... ఆక్సిజన్ను ఎర్ర రక్తకణాల్లోకి పంపిస్తూ గుండెను మామూలు స్థితికి చేరుకునేలా కృషిచేశారు. కానీ ఈ చికిత్సలో టెక్కీ తిరిగి మామూలు స్థాయికి చేరుకోగా, జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆ చికిత్సకు సపోర్టు చేయక ఆమె ప్రాణాలు వదిలారు.
భారత్లో ఈ చికిత్సపై అవగాహన తక్కువ. చాలామంది పేషెంట్లు గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరణిస్తున్నప్పటికీ, వారికి ఈ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉండటం లేదు. విషమ పరిస్థితికి చేరుకున్న గుండెను సైతం ఈ చికిత్స ద్వారా సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు హార్ట్ అటాక్కు గురైనప్పుడూ ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతోంది. ఈ చికిత్స గురించి దేశంలో అవగాహన కల్పించాల్సినవసరం ఉందని కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవీ శెట్టి చెప్పారు. శ్రీనాథ్తో పాటు 500 మందికి పైగా పేషెంట్లకు నారాయణ హృదయాలయ ఈ ఎక్మో చికిత్సను అందించింది. ఈ చికిత్సకు మొత్తం మూడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్మో చికిత్స ద్వారా తనకు పునర్జన్మ కలిగినట్టు శ్రీనాథ్ పేర్కొన్నారు.
ఎక్మో చికిత్సను ఎప్పుడు ఎక్కువగా వాడతారు?
ఎక్మో చికిత్సను ఎక్కువగా రెండు క్లిష్టమైన పరిస్థితుల్లో వాడతారు. ఒకటి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు(జయలలితకు జరిగిన మాదిరి), న్యూమోనియా లేదా గాయాలు వంటి ఇన్ఫెక్షన్ల వల్ల ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేనప్పుడు ఈ చికిత్సను అందిస్తారు.
Advertisement
Advertisement