పిక్కకు ఓ లెక్కుంది..! అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులు..! | Why Is the Calf Muscle Perform The Duties Of The Heart | Sakshi
Sakshi News home page

పిక్కకు ఓ లెక్కుంది..! హార్ట్‌ పంపింగ్‌లో కింగ్‌..!

Published Sun, Sep 15 2024 12:48 PM | Last Updated on Sun, Sep 15 2024 12:48 PM

Why Is the Calf Muscle Perform The Duties Of The Heart

మనిషికి శరీరం పైభాగంలో అంటే రొమ్ములో ఒక గుండె ఉంటుంది. అదే రీతిలో రెండు కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... పిక్కలు. నిజానికి అవి అచ్చంగా గుండెలు కాకపోయినప్పటికీ గుండె చేసే పనినే పిక్కలూ కొంతవరకు చేస్తాయి. గుండె రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్‌ చేసినట్టే సరిగ్గా పిక్క కూడా రక్తాన్ని పైకి పంప్‌ చేయడంతోపాటు పైకెళ్లాల్సిన రక్తం భూమ్యాకర్షణకు లోనై కిందికి వెళ్లకుండా అక్కడి కవాటాలు ఆపుతాయి. అందుకే ‘పిక్క’ను శరీరపు రెండో గుండెకాయగా కొందరు చెబుతుంటారు. గుండె చేసే పనిని పిక్కలు ఎలా చేస్తాయో చూద్దాం. 

పిక్కను పరిశీలనగా చూసినప్పుడు అది కూడా ఇంచుమించూ ‘హార్ట్‌ షేపు’లోనే కనిపిస్తుంది. గుండె తన పంపింగ్‌ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంటే... కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి వచ్చేలా చూస్తుంది. అందుకే దాన్ని ‘కాఫ్‌ మజిల్‌ పంప్‌’ (సీఎమ్‌పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్‌ హార్ట్‌’ అని కూడా అంటారు. 

గుండె డ్యూటీలను పిక్క ఎలా చేస్తుందంటే...  
పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడి రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్‌ అనే కండరాలు ఈ పనిలో కీలకంగా ఉంటాయి. ఈ కండరాలు క్రమబద్ధమైన రీతిలో స్పందిస్తూ... ముడుచుకోవడం (కాంట్రాక్ట్‌ కావడం), తెరచుకోవడం (రిలాక్స్‌కావడం)తో  కాళ్లకు సరఫరా అయ్యే రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. రక్తం మళ్లీ కిందికి పడిపోకుండా వాల్వ్స్‌ (కవాటాల) సహాయంతో మూసుకు΄ోతూ పైవైపునకే ప్రవహించేలా చూస్తాయి. ఒకవేళ అలా పిక్కలు పనిచేయకపోతే రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అప్పటికీ ఈ రక్తంలోని ఆక్సిజన్‌ను కండరాలు వినియోగించుకున్నందున తగినంత ఆక్సిజన్‌ అందక తీవ్రమైన అలసటకు గురవుతాయి. 

పిక్క గుండెలా పనిచేయకపోతే... 

  • కాళ్ల చివరలకు రక్తసరఫరా తక్కువగా జరగడం 

  • వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్‌ ప్రవాహం సరిగా జరగకపోవడం 

  • చెడు రక్తాన్ని తీసుకు΄ోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడంతో ఈ కింది పరిణామాలు జరగవచ్చు. అవి... 
    ⇒ కాళ్లు అలసిపోవడం 
    ⇒ కాళ్లూ, పాదాలలో వాపు 
    ⇒ కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకపోవడం 
    ⇒ కాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌ అనే కండిషన్‌తో బాధపడటం వేరికోస్‌ వెయిన్స్‌ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరలు ఉబ్బి చర్మం నుంచి బయటకు కనిపించడం) ∙కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌). 

ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటే...? 

  • చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారిలో ∙

  • ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండే లెక్చరర్లు, టీచర్లు, కండక్టర్లు, ట్రాఫిక్‌ ΄ోలీసులు... మొ‘‘ వారిలో 

  • స్థూలకాయుల్లో 

  • గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలల్లో ఈ సమస్య కనిపించవచ్చు.

సమస్యను అధిగమించడం కోసం... 

  • పాదాలను మడమ దగ్గర్నుంచి పైకీ కిందికీ (ఫ్లెక్స్‌ అండ్‌ పాయింట్‌) కదిలిస్తూ ఉండటం ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్‌) 

  • బరువును / ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం.  

కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... 
వాటిని అదిమిపెట్టేలా ‘వీనస్‌ స్టాకింగ్స్‌’ వంటి తొడుగులను ధరించాలి. అప్పటికీ అలాగే కనిపిస్తుంటే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. 

 --డాక్టర్‌ నరేంద్రనాథ్‌ మేడ,
 సీనియర్‌ వాస్కులార్‌ అండ్‌ ఎండో వాస్కులార్‌ సర్జన్‌

(చదవండి: డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement