యాక్సిడెంట్లు అయినపుడు తీవ్ర రక్తస్రావం కావడం వల్లే చాలా వరకు మరణాలు సంభవిస్తాయన్న విషయం తెలిసిందే. ఈ రక్తస్రావాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గిస్తే ప్రాణాలు కాపాడొచ్చు. రక్తస్రావాన్ని వీలైనంత త్వరగా తగ్గించేందుకు సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అద్భుతమైన జిగురును తయారు చేశారు. అవసరానికి తగ్గట్టు ఈ జిగురు సాగిపోతుంది. దీన్ని గాయంపై వేసిన ఒక్క నిమిషంలోనే రక్తస్రావాన్ని ఆపేసే అంత శక్తిమంతమైంది. ‘మిట్రో’అని పిలిచే ఈ జిగురును ఊపిరితిత్తులు, గుండె, రక్త నాళాల గాయాలకు కూడా ఉపయోగించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉచ్ఛ్వాస, నిశ్వాసలు, గుండె వేగానికి, రక్తపోటుకు అనుగుణంగా మిట్రో దానంతట అదే సాగి మళ్లీ ముడుచుకుపోతూ ఉంటుంది. దీంతో గాయాలు మళ్లీ అవుతాయన్న బెంగ ఉండదు. అయితే శరీరం లోపలయ్యే గాయాలకు వాడినపుడు అంతర్గతంగా ఈ మిట్రో కరిగిపోయేలా కొన్ని ఎంజైమ్‌లు ఉంచినట్లు పరిశోధనల్లో పాలుపంచుకున్న చార్లెస్ పికిన్స్ వివరించారు. పైగా.. అవసరాన్ని బట్టి దీన్ని కొన్ని నిమిషాల్లోనే నాశనం చేయొచ్చని, లేదంటే కొన్ని నెలలపాటు అలాగే ఉంచొచ్చని చెప్పారు. యుద్ధ సమయాల్లో అయ్యే గాయాలు మానేందుకు మిట్రో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రయోగ దశలో పరీక్షలు ముగిశాయని, మానవ ప్రయోగాలు చేసి సఫలమైతే అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఆంథొనీ వీజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment