రాష్ట్ర కేబినెట్‌లో ఆరునెలల తర్వాత జిల్లాకు ఓ మంత్రి పదవి..
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర కేబినెట్‌లో ఆరునెలల తర్వాత జిల్లాకు ఓ మంత్రి పదవి, మరో సహాయ మంత్రి హోదా దక్కనుంది. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు జిల్లాలో ఒక్క స్థానమే రావడంతో తొలి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. నామినేటెడ్ రేసులో ఇప్పటికే జిల్లాకు చెందిన పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కిన నేపథ్యంలో ఇక అభివృద్ధికి అడుగులు పడతాయని జిల్లా ప్రజలు గంపెడాశతో ఉన్నారు.
తొలి కేబినెట్‌లో జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో ప్రధాన అభివృద్ధి పనులన్నీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే చందంగా మారాయి. జిల్లాలో అభివృద్ధి, ప్రతిపాదిత పనుల ప్రస్తావనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగింది. జిల్లా ప్రజల ఆశలసౌధం రాజవ్‌సాగర్ ( దుమ్ముగూడెం ) ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఈ ప్రాజెక్టుకు అత్తెసరు నిధులే కేటాయించారు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా..? అని జిల్లా వాసులు నిరీక్షిస్తున్నారు. జిల్లా వాసులకు ఉపాధి కల్పతరువు కాబోతుందని ఊరిస్తున్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైంది.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్ ) ప్రతినిధుల బృందం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై సర్వే చేసుకొని వెళ్లి నెలలు గడిచినా ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ఇప్పటికే పారిశ్రామిక కారిడార్‌గా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు ప్రాంతాలు విద్యుత్ హబ్‌గా మారబోతున్నాయి. రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం మణుగూరులో నిర్మించ తలపెట్టిన పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకు వెళ్తున్నా ఇక్కడ నిర్వాసితుల గోడు వినిపించుకోవడం లేదు.
నిర్వాసితులు మెరుగైన పరిహారం కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వారి సమస్యపై దృష్టి పెట్టలేకపోతోంది. పవర్‌ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే స్థానికంగా ఉండే తమకు ఉపాధి దొరుకుతుందని ఈ ప్రాంత యువత వేయికళ్లతో ఎదురుచూస్తోంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రోడ్ల అభివృద్ధి పనులన్నీ జిల్లాకు కేబినెట్‌లో స్థానం లేకపోవడంతోనే ఇన్నాళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతున్నా సర్కారు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పవచ్చు. బొగ్గు గనుల దృష్ట్యా మణుగూరులో పవర్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. జిల్లాకు మంత్రి పదవి, మరో సహాయ మంత్రి హోదా దక్కుతుండడంతో ఇకనైనా ప్రధానపనులన్నీ వేగవంతం చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
జిల్లాకు ప్రధాన పదవులు..
ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లయిన తర్వాత జిల్లాకు ప్రధాన పదవులు దక్కుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవికి ఇటీవల ముఖ్యమంత్రి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాకే ఈ పదవి దక్కింది. కేబినెట్ విస్తరణలో మాజీ మంత్రి, ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంట్ కార్యదర్శి పదవులు దక్కబోతున్నాయి.
తుమ్మలకు రోడ్లు, భవనాలు లేదా హోం శాఖ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో మరికొన్ని పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు ఈ పదవులు కోసం ఇప్పటికే పోటీపడుతున్నారు. జిల్లాకు పదవుల యోగం పడుతుండటంతో జిల్లాలోని టీఆర్‌ఎస్ శ్రేణులు సంవత్సరాంతాన్ని ఘనంగా ముగించేందుకు సన్నద్ధమవుతున్నారు.
మిగిలింది నాలుగున్నరేళ్లు..
ఈ ప్రభుత్వ హయాంలో జిల్లాకు మంత్రి పదవి యోగం పట్టేసరికి ఆరునెలలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఏ పనిచేయాలన్నా మిగిలిన నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధిని పట్టాలెక్కించాలి. ప్రధానంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని టీఆర్‌ఎస్ తన ఎన్నికల అజెండాలో పెట్టింది. విద్యుత్ అవసరాల దృష్ట్యా పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడం ప్రభుత్వానికి సునాయాసం అయితే, కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించడం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ మంజూరై నిర్మాణం కొంతైనా జరిగితేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు పట్టు ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. జిల్లా నుంచి మంత్రి, పార్లమెంట్ కార్యదర్శి పదవులు పొందుతున్న వారిపైనే ఈ గురుతర బాధ్యత ఉందని జిల్లా ప్రజానీకం చర్చించుకుంటోంది.