సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పదవుల పందేరం జిల్లాలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ నేతల మధ్య దూరాన్ని పెంచుతోంది. రాష్ట్ర స్థాయిలో కీలక పదవులన్నీ పశ్చిమ ప్రాంత నేతలనే వరిస్తున్నాయనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ప్రాధాన్యతతో కూడిన పదవులన్నీ ‘పశ్చిమా’నికే దక్కాయి. రానున్న రోజుల్లో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల విషయంలోనైనా తమకు ప్రాధాన్యం ఇవ్వాలనే వాదన ‘తూర్పు’ నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగు రామన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గా కొనసాగుతున్నారు. అలాగే ముథోల్‌కు చెందిన వేణుగోపాలచారి కూడా కేబినెట్ స్థాయి పదవిలో ఉన్నారు.
ఎన్నికల్లో ఓటమి పాలైనా ఢిల్లీలో రాష్ట్ర ప్ర భుత్వ ప్రతినిధిగా ఆయన్ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో కూడా నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి చోటు దక్కింది. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌తోపాటు, కాంగ్రెస్‌లో కూడా ఆయనకు బలమైన అనుచరవర్గం ఉండటం, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండటం వంటి అంశాలు ఆయనకు కలిసొచ్చాయి. మంత్రి పదవితో పోల్చితే అంతగా ప్రాధాన్యత లేని పదవులు మాత్రం తూర్పు జిల్లా నేతలకు దక్కాయి. ప్రభుత్వ విప్‌గా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నియమితులు కాగా, మహిళా కోటాలో కోవ లక్ష్మికి పార్లమెంట్ సెక్రెటరీ పదవి వరించింది.
గతం నుంచీ వీరి మధ్య పోటీ
గతంలో జిల్లాలో పలు పదవుల విషయంలో తూ ర్పు, పశ్చిమ జిల్లాల మధ్య పోటాపోటీ నెలకొంది. అత్యంత కీలకమైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠం విషయంలో అప్పట్లో తూర్పు, పశ్చిమ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరి వరకు ఇరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు జెడ్పీటీసీల పేర్లు వినిపించాయి. కానీ.. నిర్మల్ జెడ్పీటీసీ శోభా సత్యనారాయణగౌడ్‌కే ఈ పదవి వరించింది. తాజాగా కాంగ్రెస్ ఖాతాలో ఉన్న జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ పదవి విషయంలోనూ ఇరు ప్రాంత నేతలు పోటీ పడ్డారు. ఈ పదవిని టీఆర్‌ఎస్ తమ ఖాతాలో వేసుకున్నా, చైర్మన్ పదవి విషయంలో తూర్పు, పశ్చిమ జిల్లాల డెరైక్టర్లు తీవ్రంగా ప్రయత్నిం చారు.
తూర్పు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పట్టుబట్టడంతో చివరకు ఆ ప్రాంతానికి ఈ డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కింది. అంతకు ముందు డీసీసీబీ చై ర్మన్ పదవి విషయంలోనూ ఇరు ప్రాంత నేతలు పా వులు కదిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెం దిన డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం వ్యవహారాన్ని నడిపిన చంద్రశేఖర్‌రెడ్డి పశ్చిమ ప్రాంతానికే చెందినా, తూర్పు ప్రాంత డెరైక్టర్ల మద్దతుతో ఈ వ్యవహారాన్ని నడిపారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించ లేదు.
తూర్పు.. పశ్చిమం..
Published Sat, Dec 20 2014 2:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement