ఇసుకపై మళ్లీ వార్నింగ్
Published Sun, Sep 10 2017 2:29 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
- ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై పీడీ చట్టం కింద కేసులు
- రాష్ట్ర కేబినెట్ సమావేశం హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పేర్కొంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక విధానంతోపాటు పలు అంశాలపై చర్చ జరగడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఉచిత ఇసుక పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలివీ..
►రాష్ట్రంలోని బోగస్ వ్యవసాయ కళాశాలలపై చర్యలు. దీనిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేసి అదిచ్చే సిఫారసులకనుగుణంగా అక్రమ కళాశాలల్ని రద్దు చేయాలని వ్యవసాయశాఖ మంత్రికి ఆదేశం.
► ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీలకు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పథకం అమలుకు ఆమోదం.
► తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలోని క్యాప్టివ్ పోర్టును స్విస్ చాలెంజ్ విధానంలో వాణిజ్య పోర్టుగా మార్పు చేసేందుకు అనుమతి.
► ఐపీసీలోని 376, 354 సెక్షన్లకు సంబంధించి న్యాయవిచారణలో ఉన్న మహిళా కేసుల్ని సత్వరం పరిష్కరించేందుకు 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిర్ధారిస్తూ నిర్ణయం. 13 జిల్లాల్లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సిబ్బందిని ఈ కోర్టుల్లో సర్దుబాటు చేసేందుకు అనుమతి.
► ఏపీడబ్ల్యూఆర్డీసీ ద్వారా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకోసం ప్రభుత్వ గ్యారంటీతో తక్కువ వడ్డీకి బహిరంగ మార్కెట్ నుంచి రూ.3వేల కోట్ల రుణ సమీకరణకు జల వనరులశాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
► నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్, ఫ్రిల్స్ ఎయిర్‌పోర్టు పనులు ఎస్సీఎల్ టర్బో కన్సార్టియంకు అప్పగిస్తూ నిర్ణయం. రూ.368.38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్టుకోసం 1,352 ఎకరాల భూమి గుర్తింపు.
► సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి 2017–18 సంవత్సరానికిగాను 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ప్రాథమిక ఆమోదం. దీనికి సంబంధించిన ధరలను నిర్ణయించే బాధ్యత ఏపీఈఆర్‌సీకి అప్పగింత.
► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకోసం సేకరించిన 448.88 ఎకరాల భూమికి ఎకరం రూ.12.5 లక్షల చొప్పున భూయజమానులకు పరిహారం చెల్లించేందుకు అనుమతి.
భారీగా భూకేటాయింపులు..
► నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొద్దువారిపాలెంలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు 110 ఎకరాల్ని ఎకరం రూ.4 లక్షల నామమాత్రపు ధరకు కేటాయింపు.
► వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలం కొప్పర్తిలో వంద ఎకరాల్ని మెగ్నీషియం ఇన్ గార్డ్స్ అండ్ అల్లాయీస్, ఫెర్రో సిలికాన్ పరిశ్రమ ఏర్పాటుకోసం ట్రెమాగ్ ఎల్లాయీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయింపు.
► విశాఖపట్నం మధురవాడలోని మూడోనంబర్ కొండలోని రెండెకరాల భూమిని ఇన్నోమైండ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇచ్చేందుకు ఆమోదం.
► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రాప్తాడులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 14.79 ఎకరాలు ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు. పెనుకొండ మండలం ఎర్రమంచిలో 91.22 ఎకరాలు, రాప్తాడు మండలం రాప్తాడులో 32.42 ఎకరాలు ఉచితంగా కేటాయింపు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం విట్టయ్యపాలెంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 32.32 ఎకరాలు ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం వెదురువాడలో 30 ఎకరాల్ని ఏపీఐఐసీకి ముందస్తు స్వాధీనం చేసేందుకు అనుమతి.
► తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు టీటీడీకి చెందిన 25 ఎకరాల్ని టాటా ట్రస్టుకు నామమాత్రపు ధరకు 33 ఏళ్లకు లీజుకిచ్చేందుకు అనుమతి.
Advertisement