భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బలపై ‘పచ్చ’ గద్దలు
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు.. నాడు తప్పు నేడు ఒప్పైంది!
గత ప్రభుత్వం అక్కడ లేఅవుట్ల అభివృద్ధి చేస్తోందంటూ నానా యాగీ
జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన వాటిని నాశనం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సర్కారుపై పవన్, చంద్రబాబు ఆరోపణలు
అధికారంలోకి వస్తే వాటిని కాపాడతామంటూ ప్రగల్భాలు
వాస్తవానికి.. బఫర్ జోన్ ఏర్పాటుచేసి పనులు చేపట్టిన వైఎస్సార్‌సీపీ సర్కార్
అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేపడుతున్న టీడీపీ–జనసేన
నాడు గగ్గోలు పెట్టి నేడు నోరు మెదపని పర్యావరణ శాఖ మంత్రి పవన్
విశాఖ జిల్లాలో ఎల్లోగ్యాంగ్ బరితెగింపు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు, పవన్.. ఇద్దరూ కలిసి అప్పట్లో నోటికొచ్చిన అబద్ధాల్ని ప్రజలపై రుద్దేశారు. వారసత్వ సంపదకి ముప్పు వాటిల్లుతోందంటూ గగ్గోలు పెట్టేశారు. అంతా నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నా అక్కడేదో ఘోరం జరిగిపోతోందంటూ నానా యాగీ చేసి నిజాలను ‘ఎర్రమట్టి’లో కప్పెట్టేశారు. సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడు వారే అధికారం చెలాయిస్తున్నారు.
ఇంకేముంది.. నిబంధనల్ని గాలికొదిలేసి మట్టి తవ్వకాలు జరుగుతున్నా.. ఏమో సార్.. మాకు కనబడదు.. అన్నట్లుగా ఉంది ఇప్పుడు వారిద్దరి తీరు. దేశంలోని 29 భౌగోళిక వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల్ని ‘పచ్చ’ మాఫియా మటాష్ చేస్తూ చెప్పేటందుకే నీతులున్నాయనే సామెతను గుర్తుచేస్తున్నారు. ఈ దిబ్బల వెనుకదాగున్న కథాకమామిషు ఏంటంటే..
విశాఖ జిల్లా భీమిలి మండలం సర్వే నం 49లో నేరెళ్లవలస గ్రామం ఉంది. సర్వే నం.49/1లో మొత్తం 1,067 ఎకరాలు ఉంది. ఇందులో 550 ఎకరాల్లో ఐఎన్‌ఎస్ కళింగ విస్తరించి ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లి తమకు చెందిన స్థలమని కోర్టులో విజయం సాధించిన ఓ బిల్డింగ్ సొసైటీ పేరుతో 287 ఎకరాల భూములున్నాయి. ఈ రెండింటి మధ్యలో మొత్తం 262.92 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఇవి కాకుండా.. పక్కనే ఉన్న కొత్తవలస గ్రామ పరిధిలోని సర్వే నం 75, సర్వే నం.86, 87లో సుమారు 80 ఎకరాల్లో 1982లో డీ–పట్టాలు ఇచ్చారు.
ఈ ప్రాంతంలోనే లేఅవుట్ల అభివృద్ధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే.. కొత్తవలసలోని సర్వే నం.86/1ని సబ్‌డివిజన్ చేసి.. 86/3లో ఉన్న దాదాపు 148 అడుగుల మేర బఫర్ జోన్‌గా గుర్తించి.. ఆ ప్రాంతాన్నీ గత ప్రభుత్వం భౌగోళిక వారసత్వ సంపదగా.. విశాఖ పర్యాటక ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ఎర్రమట్టి దిబ్బలకు భవిష్యత్తులోనూ ఎలాంటి ముప్పు రాకుండా చేసింది. భౌగోళిక వారసత్వ సంపదగా ఉన్న 262.92 ఎకరాల్ని సంరక్షిస్తూ ఎర్రమట్టి దిబ్బలకు ప్రత్యేక బఫర్‌జోన్ ఏర్పాటుచేసి భూ సమీకరణ పూర్తిచేసింది.
ల్యాండ్ డెవలప్‌మెంట్ ప్రక్రియ కూడా చేపట్టింది. కానీ, అప్పట్లో పవన్, చంద్రబాబు ఈ అభివృద్ధి పనులపై నానా యాగీచేసి ఎర్రమట్టి దిబ్బల్లో లేఅవుట్లు వేస్తున్నారని తెగ దుష్ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఈ పనులు ఆపేస్తామని చెప్పారు. కానీ, ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే బఫర్ జోన్‌లోకి చొరబడి మరీ మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.
కనీస అవగాహన లేకుండా గగ్గోలు..
ఇక ఎర్రమట్టి దిబ్బల్ని ఆనుకుని 70–80 ఏళ్లుగా జీడితోటలు సాగు చేసుకుంటూ డీ–పట్టాలున్న రైతుల నుంచి మాత్రమే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూలింగ్ చేపట్టింది. ఇలా అభివృద్ధి చేస్తున్న ప్రాంతం కూడా ఎర్రమట్టి నేలలే. వీటికి ప్రభుత్వం డీ–పట్టాల్ని ఎలా ఇస్తుందన్న కనీస అవగాహన లేకుండా టీడీపీ నేతలు అప్పట్లో హడావిడి చేశారు. అందుకు పవన్‌కళ్యాణ్ తందాన అంటూ గుడ్డిగా రోడ్డెక్కారు.
నిజానికి.. నేరెళ్లవలసలో భూ సమీకరణకు 2016లోనే తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఒప్పు అయిన అదే పూలింగ్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తప్పు అంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రాగానే తూచ్ అనడం.. పవన్ కూడా సైలెంట్ అవడంపై పర్యావరణవేత్తలు విమర్శలు సంధిస్తున్నారు. పైగా.. అప్పట్లో పవన్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదుచేస్తా.. 48 గంటల అల్టిమేటం జారీ చేస్తున్నానంటూ గతేడాది ఆగస్టులో వ్యాఖ్యలు చేశారు.
నిజానికి.. గత ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలుపెట్టిన లేఅవుట్‌కు హెరిటేజ్ సైట్‌కు అసలు ఏమాత్రం సంబంధమేలేదు. ఈ డీ–పట్టా భూముల్లో తోటలున్న ప్రాంతాన్ని మాత్రమే ప్రభుత్వం భూ సమీకరణ చేసిందే తప్ప.. ఎర్రమట్టి దిబ్బల్ని తొలగించడం లేదన్నది నూరు శాతం వాస్తవం.
బఫర్ జోన్ దాటి తవ్వకాలు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల భూములు, ఎర్రమట్టి దిబ్బల మధ్య బఫర్ జోన్ ఏర్పాటుచేసి ఎర్రమట్టి దిబ్బల్ని సంరక్షిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం దిబ్బల్ని కూడా దోచుకెళ్లే పర్వానికి తెరతీసింది. గత ప్రభుత్వంలో బఫర్ జోన్ ఇవతలే లే అవుట్ పనులు జరిగితే ప్రస్తుతం బఫర్ జోన్ దాటి మరీ.. కొందరు టీడీపీ, జనసేన నాయకులు కుమ్మక్కై మట్టిని తరలించేస్తున్నారు. అడ్డగోలుగా, అక్రమంగా మట్టి దందా సాగిస్తూ వారసత్వ సంపద ఉనికిని ప్రమాదకరంగా మార్చేస్తున్నారు. రెండ్రోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
మళ్లీ సైలెంట్ మోడ్‌లో పవన్..
ఇకపోతే.. టీడీపీ హయాంలో భూసమీకరణ ప్రక్రియ జరిగినప్పుడు పవన్ మౌనం వహించారు. కానీ, వైఎస్సార్‌సీపీ హయాంలో పనులు జరుగుతున్నప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తూ హడావిడి చేశారు. ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రిగా ఉంటూ కూడా ఎర్రమట్టి దిబ్బల గురించి పట్టించుకోకుండా మరోసారి మౌనముద్రలోకి జారుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎర్రమట్టి దిబ్బల ప్రత్యేకత ఇదీ..
విశాఖకు ప్రకృతి ప్రసాదించిన వరం ఈ ఎర్రమట్టి దిబ్బలు. దక్షిణాసియాలో మరోరెండు చోట్ల మాత్రమే ఇవి ఉన్నాయి. వైజాగ్‌లోని ఎర్రమట్టి దిబ్బలు విశాఖ నుంచి భీమిలీ వెళ్లే ప్రధాన రోడ్డులో సముద్రానికి ఆనుకుని ఉన్నాయి. రోడ్డుకు అటు సముద్రం.. ఇటు ఈ దిబ్బలు ఉంటాయి. 20 కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. రోడ్డు దిగి వెళ్తే మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. దిబ్బల మధ్య సందులు, పాయలుగా ఉంటుంది.
దాదాపు 18వేల ఏళ్ల కిందట అంటే చివరి గ్లేషియర్ పీరియడ్ (భూతలం మంచుతో కప్పి ఉన్న కాలం)లో ఏర్పడినవే ఈ ఎర్రమట్టి దిబ్బలని చెబుతారు. అయితే, వీటిని ఎర్రమట్టి దిబ్బలని అంటున్నా నిజానికివి ఇసుక దిబ్బలు. సముద్రం పైనుంచి వీచిన గాలితో తీరం వద్ద మేటలు వేసిన ఇసుక దిబ్బలే ఇవి. ఈ ఇసుక మట్టి రంగులో ఉండడంవల్ల వీటిని మట్టి దిబ్బలు అని పిలుస్తారు.
ఉపరితలంపై కనిపిస్తున్న దిబ్బల కింది భాగం (బేస్‌మెంట్) వయస్సు 18వేల నుంచి 20వేల ఏళ్లు ఉంటుంది. అదే మధ్య భాగం 6వేలు.. పైభాగం 3వేల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు పరిశోధనల్లో తేలింది. ఇది నిర్దిష్ట భౌగోళిక విలువలతో కూడిన భూవైవిధ్య మూలకాలతో ఏర్పడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్‌గా పిలుస్తారు. ప్రకృతి అందించిన సహజ వారసత్వం కాబట్టి భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం ఇవి రక్షణకు అర్హమైనవి.
మంత్రిగారూ విధ్వంసాన్ని ఆపండి..
ఎర్రమట్టి దిబ్బల్లో దోపిడీపై జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఇక్కడ జరుగుతున్న దోపిడీ పర్వాన్ని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎర్రమట్టి దిబ్బలు కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని.. దేశంలో ఉన్న 29 భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్యభాగమని ఆయన పేర్కొన్నారు. అలాంటి అరుదైన సంపదపై రెండ్రోజులుగా యథేచ్ఛగా దాడి జరుగుతోందని.. దీనిపై అధికారులు, సీఎం చంద్రబాబు, మంత్రి పవన్‌కళ్యాణ్ స్పందించాలని బొలిశెట్టి తన పోస్టులో డిమాండ్ చేశారు. – ‘ఎక్స్’ వేదికపై జనసేన నేత ‘బొలిశెట్టి’ పోస్టు
అబ్బే.. అది ఇది కాదు..
ఎర్రమట్టి దిబ్బల్ని దోచేస్తుంటే అధికారులు మాత్రం మరో రకంగా స్పందిస్తున్నారు. అక్రమంగా తరలించడంలేదని.. అసలు ఆ పనులు వేరు ఈ పనులు వేరంటూ భీమిలి తహశీల్దార్ టి.గోవింద్ కొత్త భాష్యం చెప్పారు. ఎర్రమట్టి దిబ్బల్ని ఆనుకుని ఉన్న హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన 287 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
సుప్రీంకోర్టుకు వెళ్లిన సొసైటీ ఈ స్థలాన్ని దక్కించుకుని.. అందులో పనులు చేస్తోందని.. ఆ భాగంలో ఎర్రమట్టి దిబ్బలు ఉంటే ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. విమర్శలు వస్తున్న నేపథ్యంలో పనుల్ని తక్షణమే నిలుపుదల చేశామని.. బుధవారం సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ తహసీల్దార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment