
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచనంతా మూడు రాజధానుల మధ్యే తిరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ చేసి తీరాల్సిందేనన్న చర్చ పట్టణాల నుంచి గ్రామసీమల వరకూ పాకింది. కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాల దగ్గరా ఇదే అంశంపై జనం మాట్లాడుకుంటున్నారు. అటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం నుంచి ఇటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ ఎక్కడికి వెళ్లినా ఎవరి నోట విన్నా ఇదే మాట నానుతోంది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, లేకపోతే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిపోయి మరోసారి విభజన వాదం పుట్టుకురాక తప్పదనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది.
- రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అభివృద్ధిపై సూచనల కోసం ఏర్పాటైన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) సైతం మూడు రాజధానులు ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తమ నివేదికల్లో నొక్కి చెప్పాయి.
- ఆ రెండు నివేదికలపై అధ్యయనం కోసం మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైవపర్ కమిటీ కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న విషయాన్ని గుర్తించింది.
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు తమ జిల్లాలను అభివృద్ధి చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారని హైపవర్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.
- అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి.
- పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇదే డిమాండ్‌ను ముక్తకంఠంతో వినిపిస్తున్నారు.
- బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతోంది.
- నాలుగుసార్లు సమావేశమైన హైపవర్ కమిటీ ఎక్కడెక్కడ ఏయే వనరులు ఉన్నాయో గుర్తించి, వాటిని వినియోగించుకోవడం ద్వారా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించే కసరత్తు జరుగుతోందని ప్రకటించింది.
- విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నానాటికీ తీవ్రతరమవుతోంది.
- అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ ఎజెండాగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది.