జూన్‌ 2న సోనియాతో సభ | Cabinet decision that Meeting with Sonia Gandhi on June 2 2024 | Sakshi
Sakshi News home page

జూన్‌ 2న సోనియాతో సభ

Published Tue, May 21 2024 4:05 AM | Last Updated on Tue, May 21 2024 4:05 AM

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి.  చిత్రంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తవుతుండటంతో ఉత్సవాలు 

రాష్ట్రం ఇచ్చిన, తెచ్చిన పెద్దలకు సన్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయం

సభ, ఉత్సవాలకు అనుమతి కోసం ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం 

తడిసిన ధాన్యం కొనుగోళ్లు.. పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం 

సన్నబియ్యం పండించే రైతులకు రూ.500 బోనస్‌ 

అమ్మ ఆదర్శ కమిటీలతో బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన 

మూసేసిన బడుల్లో.. విద్యార్థులొచ్చే చాన్స్‌ ఉన్నవి పునరుద్ధరణ 

ఎన్డీఎస్‌ఏ చెప్పిన పరీక్షలన్నీ చేశాకే కాళేశ్వరానికి మరమ్మతులు 

తాత్కాలికంగా నీటి పంపింగ్‌ సాధ్యాసాధ్యాల పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుండటం, రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్‌ ప్రభు­త్వం కొలువుదీరిన నేపథ్యంలో.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జూన్‌ 2న భారీ బహిరంగ సభ నిర్వహించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాందీతోపాటు తెలంగాణ ఉద్య­మంలో పాలుపంచుకున్న పెద్దలందరినీ పిలిచి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుమ­తి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌­ను కూడా ఆ సభకు పిలుస్తామని.. ఈ విషయంలో భేషజా­లు లేవని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఏడాదే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిందని, ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అయింది అప్పుడా? ఇప్పుడు అవుతోందా అన్న విషయం అందరికీ తెలుసు..’’ అని మంత్రి పొంగులేటి బదులిచ్చారు. 

తడిసిన ధాన్యమంతా కొనుగోలు.. 
ఇటీవలి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తి­స్థా­యిలో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయా­లని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మద్దతు ధరకు ఒక్క రూపాయి తగ్గించకుండా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. విపక్షాల మాయమాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. 

యాసంగిలో పండించిన 36లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ సేకరించిందని.. దేశంలో, రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు 3 రోజుల్లోపే చెల్లింపులు చేసిందని చెప్పారు. కాగా.. ఒక్క గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని, ఎక్కడైనా తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సమరి్పంచిందని.. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించామని వివరించారు. రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా ప్రశ్నించగా.. విధివిధానాలను తయారు చేయాల్సి ఉందని చెప్పారు. 

ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం.. 
జూన్‌ 12 నుంచి బడులు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కమిటీల ఆధ్వర్యంలో నెల రోజుల్లోగా వాటిని ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం రూ.600 కోట్లను కేటాయించామని.. అడ్వాన్స్‌గా రూ.120 కోట్లను విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీల్లో ప్రధానోపాధ్యాయులు, స్వశక్తి సంఘాల మహిళలు ఉంటారన్నారు. ఈ అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 

మూసివేసిన పాఠశాలలు తెరుస్తాం 
హేతుబదీ్ధకరణ పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూసివేసిన 5,600 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి.. విద్యార్థులు వచ్చేవాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యతోపాటు ఉపాధి కలి్పంచే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని.. మంచి మార్పు చూపించాలని కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. 

నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు. మరుగుదొడ్లు, పెయింటింగ్, ఇతర అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు యూనిఫారాలను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని.. ప్రతి విద్యార్థికి రెండు జతలు సరఫరా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ ఫీజుల నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తుందని పొంగులేటి తెలిపారు. 

టెస్టుల తర్వాతే బ్యారేజీలకు మరమ్మతులు 
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ మూడు కీలక సిఫార్సులు చేసిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తెలిపారు. ‘‘బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాలని నిపుణుల కమిటీ చెప్పింది. డబ్బులు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా అది ఉంటుందో లేదో నమ్మకం ఇవ్వలేమని పేర్కొంది. 

బ్యారేజీలకు జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. బ్యారేజీలకు పరీక్షలు పూర్తయ్యే వరకు తదుపరిగా ఏ రకమైన పనుల చేపట్టవద్దని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించాలని.. ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో పరీక్షలు నిర్వహించి, రెండింటి అభిప్రాయాల ఆధారంగా మరమ్మతులు చేయాలని నిర్ణయించాం..’’ అని వెల్లడించారు. ఈ పరీక్షలు త్వరగా నిర్వహించేలా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్‌ఏతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. 

బ్యారేజీల్లో రాళ్ల కట్టతో పంపింగ్‌కు ప్రయతి్నస్తాం.. 
కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో తక్కువ ఖర్చుతో రాళ్ల కట్టను నిర్మించి.. నీళ్లను పంపింగ్‌ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృథా కాకుండా.. నిపుణుల సూచనలతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వ తప్పును సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. 

ధర్నాల పేరుతో డ్రామాలు.. 
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం కలెక్టర్లను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ధర్నాల పేరుతో డ్రామాలు చేశారని, వారు రైతులకు ఏం చేశారో అందరికీ తెలుసని బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. 

సన్న ధాన్యం పండిస్తే రూ.500 బోనస్‌ 
వచ్చే వానాకాలంలో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సన్నవడ్ల రకాలను వ్యవసాయ శాఖ ప్రకటించనుంది. బడుల్లో మధ్యాహ్న భోజనానికి, హాస్టళ్లకు విద్యార్ధి, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలకు ఏటా 36 లక్షల టన్నుల బియ్యం అవసరం కాగా.. వాటన్నింటికీ సన్న బియ్యం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని మంత్రి పొంగులేటి చెప్పారు. 

బయటి రాష్ట్రాల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని, అందుకే రాష్ట్రంలో సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్‌ చెల్లిస్తామని వివరించారు. విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు ఇబ్బంది రావద్దని.. నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రయదారులు, నకిలీ రశీదులు జారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనవద్దని, కంపెనీల వద్దే కొనాలని, సాగు ముగిసేవరకు రసీదులు దాచిపెట్టుకోవాలని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement