హైదరాబాద్: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభకానున్నాయి. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారా?లేదా అనే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించారు. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రాన్ని అతాలకుతలం చేసిన తుపాన్లతో భారీగా నష్టపోయిన బాధితుల నష్ట పరిహారం అంశాన్ని సి.రామచంద్రయ్య రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకువచ్చారు.
వివాదస్పద చిత్తూరు జిల్లా తాగునీటి పథకంపై రాష్ట్ర కేబినెట్లో చర్చ జరిగింది. తాగునీటి పథకంపై టెండర్ల ఖరారు అంశాన్ని కేబినెట్లో ప్రతిపాదించారు. తాగునీటి పథకానికి సంబంధించి టెండర్లు ప్రతిపాదనను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 20 శాతం నుంచి 39 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నవారికి రూ.200 మేర పింఛన్ ను అందించేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మావోయిస్టులతోపాటు ఏడు తీవ్రవాద సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగింపుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు దాడుల్లో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపుకు, జీహెచ్‌ఎంసీలో మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.