నేటి నుంచి అసెంబ్లీ .. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార, విపక్షాలు
నాలుగు నుంచి వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం
ఏడాది పాలన ఫలితాలను ప్రజల ముందుంచే యత్నం చేయనున్న అధికార పార్టీ
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ
హామీలపై నిలదీయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్ దిశానిర్దేశం
ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా కమల దళం సిద్ధం
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ కోరనున్న మజ్లిస్
ఆర్‌వోఆర్–2024, హైడ్రా చట్టాలకు సభ ఆమోదం..
మహిళా యూనివర్సిటీ, బాసర ట్రిపుల్‌ఐటీ బిల్లులపైనా చర్చ
కులగణన, రైతు భరోసా, రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన చేసే చాన్స్
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రకటన చేయనున్న సీఎం రేవంత్
సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్, మండలి చైర్మన్ నేతృత్వంలో భేటీ
సభ హుందాతనాన్ని కాపాడుతూ చర్చ జరగాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్
సమావేశాల ఎజెండాపై నేడు అసెంబ్లీ, మండలి బీఏసీల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనమండలి, శాసనసభ భేటీకానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీ కూడా అస్త్రశస్త్రాలను, వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ప్రజల ముందుంచేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమైంది.
అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపడం, అప్పటి రుణాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు గత ఏడాది కాలంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం, హామీల అమలుపై నిలదీయడమే ఎజెండాగా ప్రతిపక్షాలు సభకు హాజరుకానున్నాయి. రైతు రుణమాఫీ జరిగిన తీరు, రైతు భరోసా ఇవ్వకపోవడం, ధాన్యం కొనుగోళ్లు, ఆరు గ్యారంటీల అమలు, ఫోన్ ట్యాపింగ్, లగచర్ల ఘటన, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాలు పన్నుతోంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందంటూ చార్జిషీట్లు ప్రకటించిన బీజేపీ.. ఆయా అంశాలను, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించాలని కోరాలని ఎంఐఎం భావిస్తోంది.
రెవెన్యూ చట్టం.. మహిళా వర్సిటీ..
శాసనసభ శీతాకాల సమావేశాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)–2024 చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్‌వోఆర్–2020 చట్టానికి పలు సవరణలు చేసి దీనిని రూపొందించింది. ‘హైడ్రా’కు చట్టబద్ధత కలి్పంచనుంది. మహిళా యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన అనంతర కార్యాచరణ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ జరిగిన తీరును, రైతు భరోసా విధివిధానాలను అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, జెన్‌కో ప్రాజెక్టుల నిర్మాణంపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిటీ ఇచి్చన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఏర్పాట్లపై సమీక్షించిన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్
సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్‌లో జరిగిన ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సభ ఔన్నత్యాన్ని కాపాడాలి: స్పీకర్ ప్రసాద్‌కుమార్
అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల హుందాతనం, ఔన్నత్యాన్ని కాపాడుతూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే సభ్యులకు పంపాలని, సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో ముద్రించాలని అధికారులకు సూచించారు.
అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, అసెంబ్లీ సమావేశాల కోసం ప్రతి శాఖ ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ, మండలి భేటీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయండి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ, మండలి పరిసరాల్లో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశించారు. మండలి సభ్యుల ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని, ఉల్లంఘనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వ పక్షం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు.
ఏయే రోజుల్లో... ఎన్నిరోజులు సమావేశాలు?
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనా... ఎన్నిరోజుల పాటు, ఏయే రోజుల్లో కొనసాగుతాయన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దానిపై రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోమవారం సభ వాయిదా పడిన తర్వాత మంగళ, బుధవారాలు మినహాయించి గురువారం నుంచి మళ్లీ సమావేశాలు జరుగుతాయని, వారం పాటు కొనసాగుతాయని చర్చ జరుగుతోంది. మరోవైపు సోమవారం తర్వాత ఈ నెల 16వ తేదీకి అసెంబ్లీ వాయిదా పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
గత ఏడాది డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో తొలి సమావేశాలు ప్రారంభమైనందున మళ్లీ డిసెంబర్ 9న సభ ప్రారంభానికి నోటిఫికేషన్ వచ్చిందని... అసెంబ్లీలో పలు కీలక అంశాలకు సంబంధించిన ప్రక్రియ కొంత పూర్తి కావాల్సి ఉండటంతో విరామం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. రైతు భరోసా అమలుపై విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ మరో రెండు జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని, కమిటీ నివేదికకు సమయం అవసరమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇక సామాజిక, రాజకీయ, ఆర్థిక, కులగణనకు సంబంధించిన రిపోర్టు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ఈ రెండు అంశాలపై స్పష్టమైన ప్రకటన చేశాకే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగించాలనేది అధికార పక్షం ఉద్దేశమని.. అందుకే సోమవారం తర్వాత వాయిదా వేసి, డిసెంబర్ 16 నుంచి తిరిగి కొనసాగించవచ్చని సమాచారం. అయితే సోమవారం జరిగే సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) భేటీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment