సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర మంత్రివర్గంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు స్థానం దక్కనుంది. ఈ మేరకు వారిద్దరికీ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక శాసనసభ స్థానాలను చేజిక్కించుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈలోగా మంత్రివర్గాన్ని ఇప్పటికే చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
మంత్రివర్గంలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం ఖాయమైనట్లు తెలుస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మంత్రివర్గంలో బెర్తును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. 2005, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరిటాల సునీత గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరే సమయంలో పరిటాల సునీత తీవ్రంగా ప్రతిఘటించిన విషయం విదితమే. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చే సమయంలో మంత్రి పదవి ఇస్తానని పరిటాల సునీతకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో ఇచ్చిన మాట మేరకు పరిటాల సునీతకు మంత్రివర్గంలో చంద్రబాబు స్థానం కల్పించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆమెకు దక్కే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇక చంద్రబాబు పిలుపు మేరకు 1999 ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు రాజకీయ అరంగేట్రం చేశారు.
1999 ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన కాలవ.. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ.. సార్వత్రిక ఎన్నికల్లో రాాయదుర్గం అసెంబ్లీ స్థానం పోటీ చేసి గెలుపొంది తొలి సారిగా శాసనభలోకి అడుగుపెట్టనున్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేస్తోన్న కాలవ చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్రపడ్డారు. తనకు అత్యంత సన్నిహితుడైన కాలవకు మంత్రివర్గంలో చంద్రబాబు స్థానం కల్పించినట్లు సమాచారం. మంత్రివర్గంలో కాలవకు కీలకమైన శాఖ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులుకు రెండు రోజుల క్రితమే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలో పరిటాల సునీతకు.. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలో కాలవ శ్రీనివాసులుకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన నేపథ్యంలో జిల్లా నుంచి ఇంకెవరికీ అమాత్యయోగం పట్టే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇది మంత్రి పదవి కోసం రాజీ లేని పోరాటం చేసిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు అశనిపాతంగా మారింది.
మంత్రులుగా ఇద్దరే!
Published Sat, May 24 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement