సాక్షి ప్రతినిధి, విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని మరింత విస్తరించనుంది. ఇప్పటివరకూ గుంటూరు జిల్లా పరిధిలోనే ల్యాండ్‌పూలింగ్ అమలు చేస్తుండగా తాజాగా కృష్ణాజిల్లాలోని పలు మండలాల్లోని భూముల్నీ సమీకరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదికి ఉత్తరం వైపున టూరిజం అభివృద్ధి పేరుతో ఐదు నుంచి పదివేల ఎకరాలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణ బుధవారం చెప్పారు. ఇదికాక నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో కొంత భూమిని సమీకరించేందుకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో రాజధాని ఉద్యోగులకు క్వార్టర్లు కట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాజధాని నుంచి కృష్ణానది మీదుగా వారధులు నిర్మిస్తే అక్కడి నుంచి కంచికచర్ల, నందిగామ ప్రాం తాలకు వెళ్లిరావడం తేలిగ్గా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.రాజధాని తుళ్లూరు కావడం వల్ల కూడా ఇక్కడి భూములకు మంచి ధర వచ్చింది. రైతులు తమ భూములకు మంచి ధర వచ్చిందనే ఆనందంలో ఉన్న సమయంలో ఇక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుంటారని చూచాయగా తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సీడ్ క్యాపిటల్ పరిధి 375 చ.కి.మీటర్లకు పెంపు...
సీడ్ క్యాపిటల్‌గా ఇప్పటికే 225 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నిర్ణయించారు. దీనిని 375 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు సీడ్ క్యాపిటల్ పరిధిలో ఉండే విజయవాడ, మంగళగిరి పట్టణాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్(సీసీడీఎంసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. దీనివల్ల కూడా నగరంలో కొన్ని భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు సేకరించే పనిలో సీఆర్‌డీఏ అధికారులు ఉన్నారు.
రాజధాని విస్తరణ
Published Thu, Apr 23 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement