నవమాసాలు మోసిన తల్లులే బిడ్డలకు భారమవుతున్నారు..
ముదిమి వయసులో వారిని వదిలించుకుంటున్నారు
గన్నవరంలో ఓ తల్లిని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశారు..
కొమరోలులో రోడ్డు మీదే విడిచి వెళ్లిన కుమారులు
గన్నవరం/కొమరోలు: కన్న తల్లులే బిడ్డలకు భారమవుతున్నారు. నవ మాసాలు మోసి కనీపెంచిన అమ్మలను అమానవీయంగా వదిలించుకుంటున్నారు. గన్నవరం సమీపంలో ఎముకలు కొరికే చలిలో శనివారం రాత్రి ఓ తల్లిని వదిలి వెళ్లగా, ప్రకాశం జిల్లా కొమరోలులో ఓ తల్లి వారం రోజులుగా నడిరోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నా.. కుమారుల మనసు కరగలేదు.
ఎముకలుకొరిచే చలిలో 85 ఏళ్ల అవ్వ
కృష్ణా జిల్లా గన్నవరం శివారు ఆల్ఫా హోటల్‌కు సమీపంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారులో 85 ఏళ్ల ఓ వృద్ధురాలిని కొంత మంది వ్యక్తులు తీసుకొచ్చారు. కిందికి దింపి అక్కడో ఓ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు. చలికి గజగజ వణుకుతున్న ఆ వృద్ధురాలిని కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్పందించిన గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండడంతో స్థానిక బీకేఆర్ వృద్ధాశ్రమానికి తరలించారు.
ఆమె వద్ద లభ్యమైన ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఆమె గన్నవరం మండలం కొండపావులూరుకు చెందిన నక్కా లక్ష్మీకాంతంగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
దుప్పటి కూడా లేక నడిరోడ్డుపైనే 75 ఏళ్ల అమ్మ
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లికి చెందిన కలిగవిన వెంకటలక్ష్మమ్మ(75) భర్త కొంత కాలం కిందట మృతిచెందాడు. అనంతరం ఆమె ముగ్గురు కుమారుల వద్ద ఉంటూ కాలం గడుపుతోంది. ఆస్తుల పంపకాల అనంతరం తల్లిని మాత్రం వారు పట్టించుకోవడం మానేశారు.
ఏడాది కాలంగా ఓ గుడిసెలో వదిలేశారు. ప్రతినెలా వచ్చే వృద్ధాప్య పింఛన్‌ను కూడా వారే బలవంతంగా తీసుకెళుతున్నారు. వెంకట లక్ష్మమ్మ నివాసం ఉంటున్న గుడిసె కూడా శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ఇటీవల కుమారులు తల్లిని ఇళ్లకు తీసుకెళ్లి.. మళ్లీ వారం కిందట వెన్నంపల్లెలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారం రోజులుగా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ నానా యాతనపడుతోంది.
కట్టుబట్టలు తప్ప కనీసం దుప్పటి కూడా లేకపోవడంతో ఆ అమ్మ కష్టాలు వర్ణనాతీతం. గ్రామస్తులే అన్నం పెడుతున్నారు. వృద్ధురాలి దీన స్థితిని చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొమరోలు ఎస్‌ఐ వెంకటేశ్వర్లునాయక్‌కు గ్రామానికి చేరుకుని కుమారులతో ఫోన్‌లో మాట్లాడారు. తల్లి బాగోగులు చూసుకోవాలని లేకుంటే.. అనాథాశ్రమానికి తరలిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment