
ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీకి గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీలను ఏర్పాటు చేయాలని శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ మూడు సొసైటీలలో ఒకదాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గన్నవరంలో ఎల్‌అండ్ టీ కంపెనీ మేధా టవర్స్‌ను నిర్మించింది. మంగళగిరి ఆటోనగర్ వద్ద ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలకు కావాల్సిన భూములను ఏపీఐఐసీ కేటాయిస్తోంది.
- విశాఖ, తిరుపతిలోనూ ఏర్పాటు
- ఎలక్ట్రానిక్, ఐటీ రంగాలు అభివృద్ధికి సొసైటీ కృషి
- ఇప్పటికే గన్నవరంలో మేధా టవర్స్ ఏర్పాటు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఎలక్ట్రానిక్, ఐటీ రంగాలు, పరిశ్రమలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్స్, ఐటీ సొసైటీలను ఏర్పాటు చేయాలని శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినేట్ సమావేశం నిర్ణయించింది. ఈ మూడు సొసైటీలలో ఒకదాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సొసైటీ ద్వారా ఈ ప్రాం తంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని కేంద్రంగా..
రాజధాని కేంద్రంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే గన్నవరంలో ఎల్‌అండ్ టీ కంపెనీ మేధా టవర్స్‌ను నిర్మించింది. మంగళగిరి ఆటోనగర్ వద్ద ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలకు కావాల్సిన భూములను ఏపీఐఐసీ కేటాయిస్తోంది. ఐటీ సంస్థ ‘పై’ ఇప్పటికే పది ఎకరాలు కేటాయించగా, మరో రెండు పరిశ్రమలు ఇక్కడ తమ కార్యాలయాలను పెట్టేందుకు ముందుకు రావడంతో వాటికి కావాల్సిన స్థలాలను కేటాయించేందుకు ఏపీఐఐసీ సిద్ధంగా వుంది. కాగా సైబరాబాద్‌లో ఉన్న కొన్ని సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా ఇక్కడ రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సొసైటీ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా వుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
పెరగనున్న ఉద్యోగ అవకాశాలు..
ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాల కోసం బెంగుళూరు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం ఇంజినీరింగ్‌విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలతోనూ ఇప్పటికే ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు. ఈ కంపెనీలు వస్తే వందల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వచ్చి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.