గోదావరి పుష్కరాలు, రంజాన్ కానుకలు, ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో...మంత్రివర్గం శనివారం భేటీ కానుంది.
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలు, రంజాన్ కానుకలు, ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో...మంత్రివర్గం శనివారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన 25 వేల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు, టీఎస్‌పీఎస్సీ పరీక్షల విధానం, అభ్యర్థుల వయో పరిమితి సడలింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలను చర్చించే అవకాశముంది. ఇక అనాథ బాలల సంరక్షణ, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల్లో పిల్లలకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం పెట్టే ప్రతిపాదనలపై ఇటీవల నియమించిన మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులపై చర్చించి ప్రభుత్వ విధానాన్ని ఖరారు చేయనున్నారు.
సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు చెల్లింపులపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికపైనా చర్చిస్తారు. పుష్కరాలు, ఇఫ్తార్ నిర్వహణ, ముస్లింలకు రంజాన్ కానుకగా వస్త్రాల పంపిణీ అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు రద్దు చేసినందున తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.