డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది జూన్ 1న నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది జూన్ 1న నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లోని అవసరమైన పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుఅధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీల్లో 1,104 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, 14 వర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.383.4 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. ప్రతి వర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివే..
► అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలంవేసి బాధితులకు న్యాయం చేయాలి. ఇకపై ప్రతి కేబినెట్‌లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై సమీక్షించాలి.
► జూలై 31లోపు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఫైబర్ ఆప్టిక్‌గ్రిడ్ కింద సెకనుకు 15 నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సౌకర్యం. 1.30 కోట్ల ఇళ్లకు రూ.330 కోట్లతో ఈ సౌకర్యం కల్పించాలి. ప్రభు త్వ శాఖలన్నీ ఈ-ఫైలింగ్ నిర్వహించాలి.
► పదో షెడ్యూల్‌లో ఉన్న ఆస్తులపై అధ్యయనం చేసి మంత్రులతోపాటు ఆయా శాఖల విభాగాధిపతులు నివేదికలు రూపొందించాలి. 250 గజాలు, 500 గజాల వరకు ఆక్రమణలో ఉన్న స్థలాలు క్రమబద్ధీకరణ
► మౌలానా ఉర్దూ వర్సిటీ బిల్లుకు ఆమోదం
► కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో ట్రిపుల్ ఐటీకి 151.51 ఎకరాలు కేటాయిస్తూ తీర్మానం. విశాఖపట్నంలో మెడికల్ టెక్నాలజీ మాన్యుఫాక్చరింగ్ పార్కుకు 224 ఎకరాలు కేటాయింపు.
► లేపాక్షి, వాన్‌పిక్ భూముల్ని స్వాధీనం ప్రక్రియ వేగవంతం చేసి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయం.