విజయవాడ : బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం నీటి కేటాయింపులు జరపాల్సిందేనని రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణాడెల్టాలో నారు మడులకు నీటిని విడుదల చేయాల్సిందేనన్నారు. 155 ఏళ్ల ఆయకట్టుకు నీటిని విడుదల చేయవద్దనే హక్కు ఎవరికీ లేదన్నారు. కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేయొద్దని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే జల యుద్ధాలు జరుగుతాయని తాము ముందే హెచ్చరించామన్నారు. తాము చెప్పింది నిజమేనని, తాగునీటి విడుదలలోనూ తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు నీటిని కేటాయించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. తెలంగాణ రాష్ర్ట వాటాలోనే హైదరాబాద్‌కు నీటిని కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటూనే ఎదురుదాడికి దిగుతోందన్నారు.
డెల్టాలో తాగునీటి అవసరాలకు 3.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారని, దానిలో 2.4 టీఎంసీలే దిగువకు చేరతాయన్నారు. తూర్పు కాలువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 500 క్యూసెక్కుల నీరు ఏమూలకు చాలదన్నారు. రివర్‌బోర్డు సమావేశంలో మన వాదనలు సమర్థంగా వినిపించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలన్నారు.
పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల్లో పర్యటించి నిర్వాసితుల బాధలు, ఇబ్బందులు తెలుసుకుని వారి పునరావాసానికి, ఉపాధికి ప్రాధాన్యత కల్పించేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. నీటి విడుదలలో రాజకీయాలకు తావివ్వకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. పీసీసీ కార్యదర్శి కొలనుకొండ శివాజీ, కిసాన్‌సంఘ్ నాయకుడు కుమారస్వామి పాల్గొన్నారు,
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే నీటి కేటాయింపులు
Published Sat, Jun 28 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM
Advertisement