‘పోలవరం’ వాటాకు కర్ణాటక శ్రీకారం
⇒ కృష్ణాలో 21 టీఎంసీల అదనపు వినియోగం షురూ!
⇒ ఇక దిగువకు వచ్చే నీటికి మరింత కటకటే
⇒ పోలవరం కింది వాటా కావడంతో ఏమీ అనలేని తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో తమ వాటాలను సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్న కర్ణాటక.. ఆ రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన నాలుగు ఎత్తిపోతల పథకాలకు నీటి వినియోగాన్ని మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టులకు ఇటీవలే కేంద్ర పర్యావరణ శాఖ ఓకే చెప్పిన నేపథ్యంలో.. 21 టీఎంసీల నీటిని వాడుకునేందుకు సిద్ధమైంది. ఈ నీరంతా పోలవరం ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలకు సంబంధించినది కావడం గమనార్హం. దాంతో కర్ణాటక నీటి వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది.
నాలుగు కొత్త పథకాలతో..
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక ఆ నీటిని దాదాపు పూర్తిగా వినియోగించుకుం టోంది. అదనంగా నీటిని వినియోగించుకు నేందుకు వీలుగా దాదాపు పదేళ్ల కింద బీజాపూర్ జిల్లా బుధిహాల్–పీరాపూర్, రాయచూర్ జిల్లాలోని నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్ జిల్లాలోని తిమ్మాపూర్‌ల వద్ద కృష్ణా నదిపై నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. 21 టీఎంసీల నీటిని తీసుకుని.. 1.29 లక్షల హెక్టార్లకు అందించా లనేది లక్ష్యం. అయితే ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టినా.. వాటికి ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో నిర్వహణలోకి తీసుకురాలేకపోయింది. అయితే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అధికారిక అనుమతులు ఇచ్చిన వెంటనే తమ ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను వేగిరం చేసింది.
ఎందుకంటే గోదావరి జిలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం ప్రాజెక్టును చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఏపీ పోలవరం చేపట్టడంతో కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు దక్కుతాయి. దీంతో కర్ణాటక కీ 21 టీఎంసీల్లోంచే తాము పథకాలను చేపట్టినట్లు చూపి ఇటీవలే అన్ని అనుమతులు తెచ్చుకుంది. తాజాగా నీటి వినియోగాన్నీ మొదలు పెట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పాలమూరు జిల్లాకు ఎగువనే ఉండటంతో.. ఆ జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే దిగువకు నీళ్లు రాని నేపథ్యంలో.. మరో 21 టీఎంసీలు ఎగువన వినియోగిస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం వెంటాడుతోంది.