పరిగి: కొత్త ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘వాటర్‌గ్రిడ్’ ప్రతిపాదన కారణంగా పరిగి నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన నీటి తరలింపు పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా పరిగి నియోజకవర్గ ప్రజలకు తాగునీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 0.5 టీఎంసీల నీటి కేటాయింపు కూడా జరిగిపోయింది. రూ. 50 లక్షలు మంజూరు చేసి సర్వే చేయించారు.
రూ. 150 కోట్ల అంచనాలతో టెండర్లకు రంగం సిద్ధం చేసిన సమయంలో ఎన్నికలు రావటంతో.. ప్రాసెస్ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా జిల్లాలో వాటర్ గ్రిడ్ అమలు చేస్తే... కోయిల్‌సాగర్ కథ కంచికి చేరినట్లేనని అంటున్నారు. గ్రిడ్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు తాగు నీరందుతుంది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై అటు స్థానిక ప్రజల్లోనూ ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు పథకం ప్రారంభించి పూర్తి చేస్తే 18నెలల్లో పరిగికి తాగునీరు అందుతుంది. కానీ గ్రిడ్ అమలు కావాలంటే కొన్నేళ్లు పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కోయిల్ సాగర్‌ను గ్రిడ్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
పథకానికి రూపకల్పన ఇలా...
పరిగి నియోజకవర్గంలో గత దశాబ్ద కాలంగా వేసవి వచ్చిందంటే తీవ్ర నీటిఎద్దడి ఏర్పడుతూ వస్తోంది. ఇదే క్రమంలో 20కి పైగా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య కూడా ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గత ఐదారు సంవత్సరాలుగా కోయిల్‌సాగర్ నుంచి నీళ్లందించేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రులకు , మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వం కోయిల్‌సాగర్ నుంచి నీరందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు నియోజకవర్గ పరిధిలోగల 442 ఆవాసాలకు నీరందించాలంటే 0.5 టీఎంసీల నీరు అవసరమని తేల్చారు.
ఇందుకోసం రూ. 300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. మొదటి విడతగా 243 ఆవాసాలకు నీరందించేందుకు నిర్ణయించి రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.50 లక్షలు మంజూరు చేయటంతో సర్వే పనులు పూర్తిచేసి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఈదశలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పనులకు బ్రేక్‌పడింది.
వాటర్‌గ్రిడ్‌పై కసరత్తుతో...
పరిగికి కోయిల్‌సాగర్ నీరందించేపథకానికి త్వరలో టెండర్లు పిలుస్తారని, పనులు ప్రారంభమవుతాయని పరిగి ప్రజలు కలలుగంటున్న తరుణంలో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను తెరపైకి తెచ్చింది. జిల్లా యూనిట్‌గా తీసుకుని వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు తయారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు జిల్లాలో ఉన్న సుమారు 50 లక్షల మందికి 10 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం మంజీరా, నాగార్జునసాగర్, జూరాల, సింగూర్ ప్రాజెక్టుల్లో ఎక్కడి నుంచి నీళ్లు తేవటం సులువవుతుందనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పరిగి నియోజకవర్గానికి కోయిల్ సాగర్ నీరందించే పథకం కథ కంచికి చేరినట్లైంది.
వాటర్ ‘గ్రిడ్’గండం!
Published Sun, Sep 21 2014 11:25 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement