
భక్తులతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: శ్రావణమాసం మొదటి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో పోటెత్తింది. సాయంత్రం స్వామివారు ఒంటె వాహనం పై కొలువదీరి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. మంగళవారం వేకువజామునుంచే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలను నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తిని ఒంటెవాహనం పై కొలువు దీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యులు నారికేళను సమర్పించి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తుల మధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.