ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు.
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ద్వారా రూ. 42.07 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. ఈఓతో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో 24 హుండీలను లెక్కించారు. 42 రోజులకు గానూ రూ. 42,07,438 నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 1.6 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు.
అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ. 13,792 నగదును భక్తులు సమర్పించారన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆర్టీసీ సేవాసమితి , సత్యసాయి సేవాసమితి , హనుమాన్ సేవాసమితి సభ్యులు ,ఇతర భక్తులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు సతీష్ గుప్త, జగదీష్ ప్రసాద్, గుడిపాటి ఆంజనేయులు, వనగొంది విజయలక్ష్మి, ప్రసాద్‌రెడ్డి తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.