nettikantudu
-
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ. 42 లక్షలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ద్వారా రూ. 42.07 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. ఈఓతో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో 24 హుండీలను లెక్కించారు. 42 రోజులకు గానూ రూ. 42,07,438 నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 1.6 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ. 13,792 నగదును భక్తులు సమర్పించారన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆర్టీసీ సేవాసమితి , సత్యసాయి సేవాసమితి , హనుమాన్ సేవాసమితి సభ్యులు ,ఇతర భక్తులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు సతీష్ గుప్త, జగదీష్ ప్రసాద్, గుడిపాటి ఆంజనేయులు, వనగొంది విజయలక్ష్మి, ప్రసాద్‌రెడ్డి తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
పూలంగి సేవలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదురోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో మొదటిరోజు స్వామివారు పూలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం వేకువజామునే స్వామి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించి, పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో ఆనంద్‌కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యుల చేతుల మీదుగా ఆలయ అర్చకులకు, రుత్వికులకు యాగ వస్త్రాలను అందజేశారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవాచనం, షోడోష నాందీమాతృకాపూజ, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాసన తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ చేసి యాగశాల ప్రవేశం గావించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి తులసి ఆకులతో లక్షార్చన చేశారు. పూజా కార్యాక్రమాల అనంతరం రాత్రి 8గంటలకు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు జగదీష్ ప్రసాద్, తలారి రామలింగప్ప, వనగొంది విజయలక్ష్మి, మహేష్, సతీష్ గుప్త, గుడిపాటి ఆంజనేయులు, ఏఈవో మధు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.19.75 లక్షలు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. ఆలయంలో ఉన్న 24 హుండీలను లెక్కించగా మొత్తం రూ.19.75 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈవో, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద కుమార్ తెలిపారు. అంతేకాక ఎనిమిది గ్రాముల బంగారం, ఒక కేజీ 110 గ్రాముల వెండిని స్వామి వారికి భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాక అన్నదాన హుండీ ద్వారా రూ.25,520 నగదు వచ్చింది. కార్యక్రమంలో ఈఓతో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు, పాలకవర్గం, ఆర్టీసీ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి, హనుమాన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
ఒంటె వాహనంపై నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్ : శ్రావణమాస తొలి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి ఒంటె వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు ఉత్సవ మూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రధానఅర్చకుడు వసుధరాజాచార్యులు, వేద పండితులు అనంతపద్మనాభశర్మ, రామకృష్ణావధానిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ టెంకాయ సమర్పించి ఊరేగింపు ప్రారంభించారు. వేలాదిమంది భక్తుల ఆంజనేయ నామస్మరణల మధ్య ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు.