Special Story On Summer Special Drink Goli Soda In Telugu - Sakshi
Sakshi News home page

నువ్వు విజిలేస్తే.. ఆంధ్రా సోడా బుడ్డీ

Published Sun, Mar 12 2023 5:18 PM | Last Updated on Sun, Mar 12 2023 6:36 PM

 Summer Special Drink Goli Soda   - Sakshi

పిఠాపురం: ఓ సినిమాలో ‘నువ్వు విజిలేస్తే.. ఆంధ్రా సోడా బుడ్డీ’ అనే పాట ఎంత ట్రెండ్‌ సృష్టించిందో అందరికీ తెలిసిందే.. అచ్చం అలానే అనేక సంవత్సరాలు గోళీ సోడా ఒక ఊపు ఊపింది.. అది తాగితేనే గాని ఉపశమనం పొందే పరిస్థితి ఉండేది కాదు. కడుపు ఉబ్బరంగా.. పట్టేసినట్టు.. అన్నం అరగలేనట్టు.. తేన్పు రాలేనట్టు ఉన్నా ఒక్క గోళీ సోడా తాగితే వీటన్నింటికీ సమాధానం చెప్పేది. ఇప్పుడా గోళీ సోడా ఖాళీ అయ్యింది. రోజుకో రకం సోడా మెషీన్లు అందుబాటులోకి రావడంతో గోళీ సోడాలు కనుమరుగయ్యాయి. కానీ అదే సోడా కొత్తదనంతో పునర్దర్శనమిచ్చింది.

మారుతున్న వ్యాపారానికి అనుగుణంగా రంగులద్దుకుని మార్కెట్‌లో కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కిళ్లీ షాపుల్లో మాత్రమే కనిపించే గోళీ సోడాలు కనుమరుగు కాగా, ఇప్పుడు ప్రత్యేక వాహనాల్లో కొత్త రూపంలో దర్శనమిస్తున్నాయి. గతంలో ప్రత్యేకంగా తయారు చేసిన గాజు సీసా తయారీలోనే గోళీ ఉండేది. దానిపై రబ్బరు వాషర్‌ ఏర్పాటు చేసి సగం వరకూ నీళ్లు పోసి మెషీన్‌ ద్వారా గ్యాస్‌ ఎక్కించి, సోడా తయారు చేసేవారు. దీనికి ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో కష్టపడాల్సి వచ్చేది. మెషీన్‌పై సోడాలు తయారు చేయడం కొన్ని సమయాల్లో ప్రమాదాలకు దారి తీసేది.

రాను రానూ కొత్త రకం యంత్రాలు అందుబాటులోకి రావడంతో సోడాతో పాటు డ్రింక్‌లు సైతం నిమిషాల్లో తయారవుతున్నాయి. గతంలో వచ్చిన యంత్రాలు (సోడా హబ్‌లు) సీసాలతో పని లేకుండా కేవలం గ్లాసులు మాత్రమే ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు లేకపోగా త్వరితగతిన తయారవుతుండడంతో ఎక్కువ మంది వాటిపై మొగ్గు చూపారు. దీంతో అప్పటి వరకూ అందుబాటులో ఉన్న గోళీ సోడా కనుమరుగైంది. గ్రామీణ ప్రాంతాల్లో కీచ్‌... మంటూ శబ్దాలు వినిపించగానే గోళీ సోడా తాగుతున్నారనుకొనేవారు. ప్రత్యేకంగా తయారు చేసిన బండ్లపై సోడాలు అమ్ముతూ అనేక మంది జీవనం సాగించేవారు. ప్రస్తుతం వారందరూ కనిపించకుండా పోయారు. వారి స్థానంలో కొత్త ట్రెండ్‌లో వచ్చిన గోళీ సోడాలు ఆటోలు, ప్రత్యేక వాహనాల ద్వారా విక్రయిస్తున్నారు.

రంగోళీ సోడా
ప్రస్తుత ప్రపంచంలో పాత వాటికి కొత్త రంగులు వేసి మార్కెట్‌లోకి తీసుకువస్తే అదే నయా ట్రెండ్‌గా మారిపోతోంది. అదే విధంగా గోళీ సోడా వచ్చేసింది. పాత సోడాకు కొత్త రంగులు కలిపి ఆకర్షణీయంగా తయారు చేసి, మార్కెట్‌లోకి తీసుకురావడంతో అందరూ వాటిని ఆస్వాదించడానికి ఉర్రూతలూగుతున్నారు.

రండి.. బాబూ రండి..
పూర్వం పది పైసల నుంచి ప్రారంభమైన గోళీ సోడాలు రూ.1 వరకూ అమ్మకాలు జరగగా.. ప్రస్తుతం కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన రంగుల సోడా రూ.20కి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ పలువురు ఈ సోడాలను తాగుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో ఎక్కువ మంది వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాకినాడ నుంచి వస్తున్న సోడా వ్యాపారులు పలు పట్టణాల్లో ప్రత్యేక వాహనాలపై వచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. కూలింగ్‌ పెట్టి మరీ అమ్ముతుండడంతో అందరూ వీటిని తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement