మీకు తెలుసా? నిమ్మలకుంట
హాయ్ పిల్లలూ.. ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామం గురించి మీకు తెలుసా? ఎందుకంటే ఈ ఊరు పేరు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎలాగంటే ఇక్కడ తోలుబొమ్మలను తయారు చేస్తుంటారు. మన ప్రాచీన సంస్కృతిలో భాగమైన తోలుబొమ్మలాటలో ఇక్కడి వారు దేశ, విదేశాల్లో పేరుప్రఖ్యాతులు గడించారు. ధర్మవరం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తికి వెళ్లే దారిలో ఉన్న ఈ గ్రామానికి బస్సులు, ఆటోలలో వెళ్లవచ్చు. ఈ గ్రామంలో కాలుపెడితే ఆరుబయటే అరుగులపై తోలుతో బొమ్మలను తయారు చేస్తుండడం చూడవచ్చు.
150 కుటంబాలు ఉన్న ఈ గ్రామంలో 80 కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మేక చర్మాన్ని బాగా శుభ్రం చేసి ఎండబెడతారు. అలా ఎండిన చర్మంపై పెన్సిల్‌తో బొమ్మను గీస్తారు. స్కెచ్‌పై చిన్నచిన్న రంద్రాలు వేసి మిగిలిన భాగాన్ని తీసివేసి, రంగులు వేస్తారు. ఇలా ఒక్కొక్క బొమ్మ చేసేందుకు వారం పది రోజులు పడుతుంది. ఈ బొమ్మలు గృహాలంకరణలోనూ బాగుంటాయి. అంతేకాదండోయ్.. ఎంచక్కా టేబుల్ ల్యాప్ షెడ్స్, పార్టిసన్స్, వాల్ హ్యాంగిల్స్, పెన్‌స్టాండ్‌లు, బుక్ స్టాండ్‌లు, బ్యాగ్‌లు కూడా ఆకర్షణీయంగా తయారు చేసి, విక్రయిస్తుంటారు. ఇక్కడి కళాకారులు హస్తకళల్లో జాతీయ స్థాయిలో అవార్డులు కూడా పొందారు. ఇంతటి ప్రాచీన కళను నేటికీ సజీవంగా ఉంచినందుకు గ్రామానికి చెందిన దళవాయి చలపతి, శ్రీరాములు తదితరులకు రాష్ట్రపతి పురస్కారాలు కూడా దక్కాయి.
- ధర్మవరం రూరల్