దటీజ్‌ సుధీర్‌..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి.. | Sudheer Rajbhar Founder Of Chamar Studio | Sakshi
Sakshi News home page

దటీజ్‌ సుధీర్‌..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..

Published Mon, Feb 10 2025 12:09 PM | Last Updated on Mon, Feb 10 2025 12:39 PM

Sudheer Rajbhar Founder Of Chamar Studio

అవమానిస్తే కుంగిపోయి కూర్చొండిపోతాం. మన బతుకు ఇంతే అనే స్థితికి వచ్చేస్తాం. కానీ కొందరే ఆ అవమానానికి సరైన సమాధానం చెబుతారు. మరోసారి అలా దూషించే సాహసమే చెయ్యనీకుండా చేసి..తప్పు గ్రహించుకునేలా చేస్తారు. బాధపెట్టిన నోళ్ల చేతే గౌరవం పొందేలా చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ డిజైనర్‌  సుధీర్ రాజ్‌భర్. ఏ మాటతో అవమానించి దూషించేవారు. ఆ మాటతోనే గౌరవం పొందడమే గాక..దూషణాలనే ఎలా అలంకారప్రాయంగా మార్చుకోవాలో చూపి అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతడి విజయగాథ వింటే..బతుకు విసిరే సవాళ్లకు చావుదెబ్బ కొట్టేలా సమాధానం చెప్పడం ఎలాగో తెలుస్తుంది. మరీ సుధీర్‌ స్టోరీ ఏంటో చూద్దామా..!

భారతీయ కుల వ్యవస్థలో, 'చమర్' అనే పదాన్ని అణగారిన కులాలను దూషించడానికి ఉపయోగించే వారు. పూర్వం దళితులకు కులవృత్తి తోలుపని. వాళ్లని చర్మకారులు అని కూడా పిలుస్తారు.  మన ఇప్పుడు చెప్పుకుంటున్న డిజైనర్‌ సుధీర్‌ రాజ్‌ భర్‌(Sudheer Rajbhar(36)) కూడా ఆ కులానికి చెందినవాడే. అతడు ఉత్తరప్రదేశ్‌లోని తన సొంతూరుకి వెళ్లినప్పుడల్లా "భర్‌", "చమర్‌" వటి కులదూషణ పదాలతో అవమానాలపాలయ్యేవాడు. అయితే అక్కడ అది సర్వసాధారణం. 

అక్కడి ప్రజలకు అదొక ఊతపదంలా ఆ పదాలు నోళల్లో దొర్లేవి. ఇక ఆ మాటలు పడుతున్న దళితులకు కూడా అవి అలవాటైపోయాయి. అందువల్ల వాళ్లెవ్వరూ దీన్ని వ్యతిరేకించే సాహసం కానీ, అలా పిలవొద్దని తెగేసి చెప్పడం గానీ చేసేవారు కాదు. అలాంటి స్థితిలో పెరిగిన సుధీర్‌ వాటన్నింటిని ఆకళింపు చేసుకునే బతికాడు. 

అతడి బాల్యం ముంబై(Mumbai)లోని చౌల్‌లో జరిగింది. అక్కడ ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాడు. కొందరూ బాగా స్థిరపడిన కళాకారుల వద్ద పనిచేసే అవకాశం లభించింది కానీ, కేవలం తన కులం కారణంగా తన పనికి ఎలాంటి క్రెడిట్‌ రాకపోవడం అనేది కాస్త కష్టంగా ఉండేది సుధీర్‌కి. ముందు తనలాంటి వెనుబడిన కులాల నుంచి వచ్చిన ప్రజలు గౌరవంగా ఉండేలా ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నాడు. 

సరిగ్గా అదే సమయంలో 2015లో బీఫ్‌పై నిషేధం విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం.  అప్పటి నుంచి ఈ బలహీన వర్గాలకు ఉపాధి దొరకక కష్టాలు మొదలయ్యాయి. చాలామంది నిరుద్యోగులుగా మారిపోయారు. అప్పుడే ఈ తోలు కళాకారులకు సహాయపడే ఒక మాధ్యమాన్ని తయారు చేయడానికి సుధీర్‌ ముందుకు వచ్చారు. ఏ పదంతో తన కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఆ పేరుతోనే ఒక ప్రాజెక్టు చేపట్టి మార్పు తీసుకురావాలని భావించాడు. 

అలా సుధీర్‌ 2017లో ఆ తోలు కళాకారులకు ఉపాధి కల్పించేలా "చమర్‌" అనే స్టూడియో(Chamar Studio)ని ప్రారంభించారు. ఇక్కడ చమర్‌ అని పదం ఉపయోగించడానికి వివరణ ఇస్తూ..తన కమ్యూనిటీ వాళ్లను ఏ పదంతో అవమానించే ప్రయత్నం చేసేవారో ఆ పదంతోనే స్టూడియోకి నామకరణం చేసినట్లు తెలిపారు. 

దీనిలో తోలు ఉత్పత్తులకు బదులుగా రీసైకిల్ చేసిన రబ్బరు(recycled waste rubber)తో భర్తీ చేయడం ద్వారా చేతివృత్తులవారి జీవనోపాధిని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చమర్ స్టూడియో అత్యంత అందంగా రూపొందించిన మినిమలిస్ట్ బ్యాగులు, వాలెట్లు, బెల్టులు, ఇతర ఉత్పత్తులను విక్రయిస్తుంది. అంతేగాదు డిజైనర్ ఉత్పత్తులను సరమైన ధరలోనే తయారు చేస్తుంది. కాబట్టి అత్యంత ఖరీదైన ధర రూ. 39,000 వరకు ఉండగా, అత్యల్ప ధర రూ. 1,500 నుంచి ప్రారంభమవుతుంది.  అలా ఈ స్టూడియో ఉత్పత్తులు ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌(Luxury Brand)గా అనతికాలంలోనే పేరుగాంచాయి. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 50% కళాకారులకు, రాజ్‌భర్ ఫౌండేషన్, ది చమర్ ఫౌండేషన్‌కు తిరిగి వెళ్తుంది.

సారూప్య బ్రాండ్‌లతో పోటీని స్థాపించడం కంటే, మార్పు, సాధికారతకు ఒక సాధనంగా కులతత్వ నిందను ఉపయోగించడం ఈ స్టూడియో ఆలోచన అని చెబుతారు సుధీర్‌. ఈ బ్రాండ్‌ పేరుతో తయారైన వస్తువుల కారణంగా ప్రజలకు తమను అవమానించే పదం గురించి తెలియడమేగాక, ఆలోచించడం వంటివి చేస్తారు. తద్వారా ఇలాంటి అవమానాలు, దూషణలకు తెరపడుతుందనేది ఆయన ఆశ. 

భారత ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగం తమ కమ్యూనిటికి చెందిన వారు తయారు చేసే ఉత్పత్తులు. అలాంటప్పడు వారెందుకు ఇంతలా వివక్షకు గురవ్వుతున్నారనే బాధలోంచి పుట్టుకొచ్చిందే ఈ స్టూడియో అని గర్వంగా చెబుతారు సుధీర్‌. ఆయన తను నేర్చుకున్న కళతో పదిమందికి ఉపయోగపడేలా ముఖ్యంగా తన కమ్యూనిటీకి చెందిన వారు తలెత్తుకుని గౌరవంగా బతికేలా చేస్తున్నాడు. 

అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు అంటూ సానుభూతి, ధన సాయం కాదు..వాళ్లు కూడా మనలాంటి మనుషులే అని గుర్తింపు, గౌరవం అని అంటారు సుధీర్‌. కళతో మానసిక ఆరోగ్యం నయం చేయడమే కాదు సమాజం తీరుని, దృకపథాన్ని మార్చి బాగు చెయ్యొచ్చని డిజైనర్‌ సుధీర్‌ తన చేతలతో చేసి చూపించాడు. అంతేగాదు అవమానానికి ప్రతిఘటించడం బదులు కాదు, అవతలి వాడు చేసిన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా బతికి చూపాలి అని వెలుగెత్తి చెప్పారు.

 

(చదవండి:  జేఈఈ మెయిన్‌లో రికార్డు రేంజ్‌ మార్కులు! కానీ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు..)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement