నాన్నా... చూసొద్దామా! | Summer Special... | Sakshi
Sakshi News home page

నాన్నా... చూసొద్దామా!

Published Tue, May 3 2016 12:21 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

నాన్నా... చూసొద్దామా! - Sakshi

నాన్నా... చూసొద్దామా!

సమ్మర్ స్పెషల్
హైదరాబాద్‌లో ఉన్న పిల్లలకు హైదరాబాద్‌లో ఉన్న విశేషాలు చూసే టైమ్ ఉండదు. హైదరాబాద్‌లో లేని పిల్లలకు అక్కడకు చేరే వీలు ఉండదు. సమ్మర్ సెలవలు అందుకే వస్తాయి. ఉన్న ఊళ్లోనివి తెలియని ఊళ్లల్లోనివి చూసి రమ్మంటాయి. పిల్లలూ... పెద్దల వెంటపడండి. బస్సెక్కండి... ఆటో ఎక్కండి... రైలు ఎక్కండి... కానీ ఇవి మాత్రం మిస్ కాకండి.
 
సాలార్‌జంగ్ మ్యూజియం
గంటకోసారి గంటకొట్టే అబ్బాయికి ఆకలెయ్యదా నాన్నా? ఈ ప్రశ్నకు మీ దగ్గర ఆన్సర్ ఉంటుందా? రెబెకాకు ముసుగు ఎవరు కప్పారు? ఏమో! వీటికి సమాధానాలు మీ దగ్గర లేకపోయినా ఏం ఫరవాలేదు. ఓ సారి పిల్లల్ని సాలార్‌జంగ్ మ్యూజియానికి తీసుకెళ్లండి. అలాగే మీకు దగ్గరున్న ఇతర మ్యూజియాలనూ చూపించండి. కళాజగత్తును, శాస్త్రసాంకేతిక ప్రపంచాన్ని ఏకకాలంలో అర్థం చేసుకుంటారు.
 
సాలార్‌జంగ్ మ్యూజియం హైదరాబాద్‌లోని దివాన్‌దేవుడీలో ఉండేది. ఇప్పుడు దారుషిఫా చౌరస్తాకు సమీపంలో మూసీనది పక్కన 1968లో నూతనంగా నిర్మించిన భవనంలోకి సాలార్‌జంగ్ మ్యూజియాన్ని మారింది. 1,2,3 సాలార్‌జంగ్‌లు భారతదేశంతో పాటు విదేశాల నుంచి సేకరించిన దాదాపు 48 వేల కళాఖండాలను మ్యూజియంలో పొందుపరిచారు. రెబేకా (పాలరాతి ముసుగు సుందరి), గంటలు కొట్టే గడియారంలతోపాటు చైనా, జపానీస్, యూరోపియన్ పెయింటింగ్‌లతో కూడిన గ్యాలరీలు, అరుదైన కళాఖండాలు మ్యూజియంలో సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.
 
ఎప్పుడు వెళ్లవచ్చు?: శుక్రవారం సెలవు. మిగిలిన రోజుల్లో ఉదయుం 10 గంటల నుంచి సాయుంత్రం 5 గంటల మధ్య. టిక్కెట్లు: పెద్దలకు -రూ.20, పిల్లలకు-రూ.10 (12 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితం), విదేశీయుులకు- రూ.500.
 సాలార్‌జంగ్ మ్యూజియం ఆవరణలో పార్కించ్ చార్జ్... ద్విచక్ర వాహనానికి రూ.5, కారుకు రూ. 30, బస్సుకు, రూ.50.
 
బిర్లా ప్లానిటోరియం
నక్షత్రాలు ఆకాశంలోనే ఉంటాయా? గ్రహాలను మనం చూడలేమా? డైనోసార్ మన ఇల్లంత ఉంటుందా? ఇన్నింటికి జవాబుల కోసం బుర్రగోక్కోవడం కంటే ఓసారి ప్లానిటోరియానికి తీసుకెళ్తే సరి.
 
హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియంలో పిల్లలకి సైన్స్ నాలెడ్జ్‌కి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. డైనోసార్‌లో పుట్టుకను శాస్త్ర రీత్యా చూడవచ్చు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన వెలకట్టలేని అంశాలు ఎన్నో ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. శాస్త్రీయ ఆలోచనలు ఒంటపట్టించేందుకు సైన్స్ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు బిర్లా సైన్స్ మ్యూజియం ఓ గొప్ప వేదిక.

జీవ పరిణామ క్రమాన్ని తెలియజేసేలా శిలాజాలు, అంతరిక్ష రహస్యాలను అద్దం కంటే ప్లానిటోరియం ప్రదర్శన పిల్లలకు విజ్ఞానదాయకంగా, పెద్దలకు వినోదంగా ఉంటుంది. ఓసారి పిల్లల్ని తీసుకెళ్తే పై ప్రశ్నలకు సమాధానాలు వాళ్లే తెలుసుకుంటారు. అప్పుడు ఆ చిట్టి బుర్రల్లో కొత్త ప్రశ్నలు మొదలవుతాయి. కొత్త క్వశ్చన్ బ్యాంకులన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. బిర్లా ప్లానిటోరియం, మ్యూజియం నౌబత్ పహడ్‌లో... ఖైరతాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లు కేవలం ఒకటి, రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి.
 
ఎప్పుడు వెళ్లవచ్చు?: వారాంతపు సెలవు లేదు. ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య వెళ్లవచ్చు.
ప్రవేశ రుసుము: రూ.80.
ఫోన్ నెంబర్లు: 040- 23241067, 23235081.
 
నెహ్రూ జూలాజికల్ పార్కు
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు పాతబస్తీ బహదూర్‌పురాలో 380 ఎకరాల సువిశాల వైశాల్యంతో విస్తరించి ఉంది. ఇది అరుదైన వన్యప్రాణులకు అభయారణ్యం. అడవిని పోలిన సపారీ పార్కులతో ఇది వైవిధ్యమైన ప్రాణిప్రపంచం. రంగురంగుల చిలకల ప్రపంచం, వివిధ రకాల కీటకాలశాల, రకరకాల సీతాకోక చిలకలతో సంద ర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తూ ఆలోచింపజేస్తుంది ఈ జూ.
 
దేశంలో పూర్తిగా కనుమరుగవుతున్న ఆసియా సింహాల పరిరక్షణను విజయవంతంగా నిర్వహిస్తోంది ఈ జూ. వాటి పునరుత్పత్తికి దేశంలోనే రికార్డులెక్కిన జూలలో జన్యు ప్రయోగాల ద్వారా తెల్ల పులుల సంతానోత్పత్తి నిలయం అయింది. జీబ్రా, కంగారు వంటి అరుదైన విదేశీ జంతువులు కనుమరుగయ్యాయి. హార్న్‌బిల్, ఫెలికాన్, ప్లెమింగ్ ఘోష్, సారాస్ క్వెన్, లవ్‌బర్డ్స్, తెల్ల చిలకల వంటి అరుదైన పక్షులతో పాటు దేవాంగపిల్లి, జంగిలికాట్, ముళ్ల పంది, కస్తూరి పిల్లులు, ఆసియా సింహాలు, తెల్లపులులు, చిరుత, ఆఫ్రికా సింహం, జాగ్వార్ రకం చిరుత పులి, సరిసృపాల జగత్తులో రస్సల్ ఫైపర్, రాక్‌ఫైథాస్, లెటిక్యూలేటెడ్ ఫైథాస్ రకాల కొండచిలువలు, ఆఫ్రికన్ చింపాంజి, జంట ఖడ్గమగాలు, నీటి గుర్రాలు ఈ జూకు ప్రత్యేకఆకర్షణ. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఎలా గడిచిపోయిందో తెలియదు.
 ఎలా వెళ్లాలంటే... నగరంలో అన్ని ప్రదేశాల నుంచి సిటీబస్సులు ఉన్నాయి.
 
ఎప్పుడు వెళ్లాలి?: ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సోమవారం జూకు సెలవు.
ప్రవేశ రుసుం: పెద్దలకు రూ.30, చిన్నారులకు రూ.15.
బ్యాటరీ వాహనం డ్రైవ్: పెద్దలకు రూ.40, చిన్నారులకు రూ.25.
చిట్టి రైలు ప్రయాణం: పెద్దలకు రూ.15, చిన్నారులకు రూ.5లు.
 
బొటానికల్ గార్డెన్..!
ప్రకృతి మనకు ఎన్ని చెట్లనిచ్చిందో పిల్లలకు చెప్పడం ఎలా? కష్టం మీద పది పేర్లు చెబితే పదకొండవ చెట్టు పేరు గుర్తు రాదు. గూగుల్ సెర్చ్‌లో చెట్ల పేర్లను వెతకడం మాని బొటానికల్ గార్డెన్ బాట పట్టండి. చెట్లను చూడడంతోపాటు ఆరోగ్యకరమైన గాలని పీల్చుకోవచ్చు.
 
హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్ ఇప్పుడు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉంది. ఇది 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గార్డెన్ అటవీప్రాంతాన్ని తలపిస్తుంది. చూడచక్కనైన చల్లటి వాతావరణం గార్డెన్ సొంతం. దీనిని ‘కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్, కొత్తగూడ’ అంటారు. ఇందులో రోజ్ గార్డెన్, ఎంటర్‌టైన్ పార్క్ ఉండేవి. వేసవి కారణంగా వాటిని నిర్వహించడం లేదు.

పెద్ద పెద్దపార్టీలు, గెట్‌టూ గెదర్స్, ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తారు. దట్టమైన ఆటవీ ప్రాంతంలో ఉండే వృక్షాలను ఇందులో చూడవచ్చు. సైన్స్‌కు సంబంధించి ఎన్నో శాస్త్రీయ నామాలు గల ఔషధమొక్కలు ఇందులో ఉన్నాయి. ఇది సైన్స్ విద్యార్థులకు రిసెర్చ్ కేంద్రం, పర్యాటకులకు వినోదం. పిల్లలకు రోజంతా ఉత్సాహంగా గడపడానికి చక్కటి ప్రదేశం. ‘ఆడుకుంటూ నేర్చుకోవడం’ అంటే ఏమిటో ఇక్కడకు వెళ్తే తెలుస్తుంది.
 
ఎప్పుడు వెళ్లవచ్చు: ఉదయం 9 గం॥నుంచి సాయంత్రం 5 గం॥( ఏప్రిల్, మే నెలల్లో సాయంత్రం 6.30 వరకు). వారాంతపు సెలవులు: లేవు. ప్రతిరోజూ వెళ్లవచ్చు.
ప్రవేశ రుసుం: పిల్లలకు రూ.5 , పెద్దలకు రూ. 15.
మరిన్ని వివరాలకు: రాజేంద్ర కుమార్, అసిస్టెంట్ ప్లాంటేషన్ మేనేజర్‌ను (9533068033) సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement