Salarjang Museum
-
రీ విజిట్..దూరం
అఫ్సర్ నలభై యేళ్ల సమగ్ర కవిత్వం (1979–2019) ‘అప్పటినుంచి ఇప్పటిదాకా’ ఈ శుక్రవారం సాలార్జంగ్ మ్యూజియంలో ఆవిష్కరణ అయింది. ప్రచురణ: చిత్రలేఖ ప్రొడక్షన్స్. దానికిముందు కవి జీవితపథాన్ని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు, ఒక వీడియో ప్రదర్శించారు(ప్రొడ్యూసర్: కిరణ్ చర్ల), కొన్ని కవితల్ని ఫ్రేములు కట్టి వేలాడదీశారు. ఏ కవి అయినా కలలుగనే, ఎంతటివారికైనా పట్టదేమో అనిపించేంతటి యోగం! సాహిత్య పోషకుడు బి.నర్సింగరావు ఇల్లే ఇది సాధ్యపడి ఉంటుంది. ఫ్రేముల్లోని ఒక కవిత: దూరం మరణాన్ని అడిగి ఓ మూడు క్షణాలు అరువు తెచ్చుకున్నాను. మరుక్షణం మరణం నెత్తిమీద నా నాలుగో క్షణాన్ని యుద్ధానికి పంపాను. తీగ మీద నడక ఎంత కష్టం! ప్రతీసారి తీగమీద ఆరేయలేక రాలిపోయిన ఎన్ని మాటల్ని ఎన్ని శ్వాసల్ని ఏరుకుని మళ్ళా జేబులో దోపుకొని వచ్చేస్తుంటానో! పలికిన మాటల మధ్య పలకని మాటల నిశ్శబ్దం బాధిస్తుంది. పెదాల చప్పుడొక్కటే విని గుండె చప్పుడిని సమాధి చేసుకుని వెనక్కి వచ్చేస్తాను. -అఫ్సర్ -
పక్షిపాతం
హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఓ చారిత్రక గోడ గడియారం ఉంది.అందులో ఓ సైనికుడు ఉంటాడు. ఆసైనికుడు ప్రతీ గంటకీ ఓసారి బయటకు వచ్చి ఎన్నిగంటలైందో అన్నిసార్లు గంట కొట్టి మళ్లీ లోపలికి వెళ్లిపోతాడు.సరిగ్గా ఆ సైనికుడిలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అప్పుడప్పుడు సినీ గడియారంలోంచి బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్పి మళ్లీ లోపలికి వెళ్లిపోతూ ఉంటారు. తాను అలా వచ్చి వెళ్లకపోతే ప్రజలకు టైమ్ ఎంత అయ్యిందో చెప్పేవాళ్లే ఉండరని పవన్ అభిప్రాయం. బయటకు వచ్చే టైమ్ లేనపుడు ఆయన ట్విట్టర్లో తన మనసులో మాటలు పెట్టేసి ఊరుకుంటారు. ట్వీటువు పిట్టలా. ప్రత్యేక హోదా కోసం యువత పోరాడాలని అనే పవన్ కళ్యాణ్ తాను మాత్రం పోరాడరట. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు రాష్ట్రాన్ని మోసం చేశారని ఓ పక్క అంటూనే... వాళ్లంటే తనకి చాలా గౌరవమని ఒకటికి పది సార్లు గుర్తు చేస్తూ ఉంటారు పవన్. అది గౌరవమా లేక భయమా అన్నది అర్థం కాక జనం అయోమయానికి గురవుతూ ఉంటారు. అయితే అనుభవజ్ఞులు మాత్రం అది భయమే అని అంటున్నారు. పల్లెటూరి కోడి పుంజులు (నగరాల్లో కనపడ్డం లేదనుకోండి) తాము కొక్కొరోకో అనకపోతే లోకానికి తెల్లారదని అనుకుంటూ ఉంటాయి. అందుకే ఎంత ఆలస్యంగా పడుకున్నా లోకం మీద జాలితో తెల్లారగట్టే లేచి కొక్కొరోకో అని కూస్తూ ఉంటాయి. ఈ కోడి పుంజు లాంటి వారే మన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. విభజన సమయంలో రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తాను అడిగి ఉండకపోతే అసలు ప్రత్యేక హోదా అనేది ఒకటి ఉంటుందని ఎవరికీ తెలీదని ఆయన కొన్ని వందల సార్లు చాలా అమాయకంగా (కొండొకచో గడుసుగా) అంటూ వచ్చారు. ఎవరికీ తెలీదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎవరూ అడగరులే అని ఆయన అనుకున్నారు. కానీ ప్రతిపక్షాలు... యువత ప్రత్యేక హోదా కోసం గట్టిగా నినదిస్తూ ఉంటే వెంకయ్యనాయుడు కళ్లు మూసుకుని ‘పాపం అంతా కాంగ్రెస్‌దే’ అంటున్నారు. కొంగ చెరువులో ఒంటికాలిపై నిలబడి తన ముక్కు గేలానికి అందే దూరంలో చేప వచ్చేంత వరకు జపం చేస్తున్నట్లు మౌనంగా నిరీక్షిస్తూ ఉంటుంది. చేప పిల్ల అటుగా వచ్చిన వెంటనే అమాంతం దాన్ని ఒడిసి పట్టుకుని భోంచేసి... మళ్లీ జపంలో పడిపోతుంది. సరిగ్గా ఈ కొంగలాగే మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఎవరైనా తన గేలానికి పడే ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కనిపిస్తే వారిని అమాంతం కొనేసి తన వైపు లాగేసుకుని... తాను నిజాయితీకి మారు పేరని... నిప్పులాంటివాడినని స్వయం కితాబునిచ్చుకుంటూ ఉంటారు. ఈ జపంలో నిమగ్నమైపోవడం వల్లనే ఆయనకు ప్రత్యేక హోదా కోసం జరుగుతోన్న ఉద్యమ ఘోష వినపడదు. ఆందోళనలు కనపడవు. చిలుక జోస్యం చెప్పేవాళ్ల చక్కటి తర్ఫీదు వారి పంజరంలోని చిలుకలను చూసి తెలుసుకోవచ్చు. చిలుక జోస్యం చెప్పేవారి దగ్గరకు జోస్యం చెప్పించుకునేందుకు వచ్చిన వారి పేరు మీద కార్డు తీయమని యజమాని చెప్పడమే తరువాయి... ఉన్న కార్డుల్లోంచి ఓ కార్డును ముక్కుతో తీసి పక్కన పెడుతుంది. ఆ కార్డును చూసి చిలుక జ్యోతిష్కుడు తనకు నచ్చింది చెప్పుకు పోతాడు. ఈ రామ చిలుక మాదిరిగానే మన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చిలుక జ్యోతిష్కుడు వెంకయ్యనాయుడు చెప్పినప్పుడల్లా ప్రత్యేక హోదా బదులు కేంద్రం రాష్ట్రానికి ఏమేమి ఇస్తుందో అప్పచెప్పేసి పంజరంలోకి వెళ్లిపోతున్నారు. ఉష్ట్ర పక్షి (ఆస్టిచ్ర్) ఏదన్నా ప్రమాదం ముంచుకొచ్చినపుడు తన తలను ఇసుకలోకి దింపి చాలాసేపు అలాగే ఉండిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా అలాగే తన నిర్ణయాలపైనా తన విధానాలపైనా నిరసనతో ఎవరైనా ప్రశ్నలు సంధించడం మొదలు పెడితే ఏమీ మాట్లాడకుండా తలను మౌనంలోకి దూర్పేసి అలాగే ఉండిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి యూత్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించి నినదించినప్పుడల్లా కాకులు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ కాకిగోల భరించలేక ఆయన స్పెషల్ స్టేటస్ ‘హూష్కాకి’ అని, స్పెషల్ ప్యాకేజ్ బెస్ట్ బ్రీఫ్‌కేస్ డీల్ అని యూత్‌ని లాఠీలతో తరిమికొట్టిస్తున్నారు.చెదిరిన తన గూడు ఏ చెట్టుమీద ఉందో మర్చిపోయిన వడ్రంగి పిట్టలా లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ్ ప్రత్యేక హోదా కోసం ఇపుడు సోషల్ మీడియాలో తెగ ఆరాట పడుతున్నారు. పాల నుండి నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే తాగే హంసలా జనం పాలకులు... పార్టీల నేతల చిత్ర విచిత్ర విన్యాసాలను నిశితంగా గమనిస్తున్నారు. ఎవరివి వేషాలో... ఎవరివి వెధవ్వేషాలో వాళ్లు తేలిగ్గానే పోల్చుకుంటున్నారు. ట్వీటువు పిట్టల... దొంగకొంగల... పంజరపు రామచిలుకల బలాలు... దౌర్బల్యాలను జనం బేరీజు వేసుకుంటున్నారు.పక్షులన్నీ ఇలా ఉంటే ఓ పంది మాత్రం ప్రత్యేక హోదాపై జోకులేసుకుంటూ వెళ్లిపోయింది. ఆ బురద జోకు భరించలేక జనం ముక్కులు మూసుకుని దూరంగా పరుగులు తీశారు. – నానాయాజీ -
నాన్నా... చూసొద్దామా!
సమ్మర్ స్పెషల్ హైదరాబాద్‌లో ఉన్న పిల్లలకు హైదరాబాద్‌లో ఉన్న విశేషాలు చూసే టైమ్ ఉండదు. హైదరాబాద్‌లో లేని పిల్లలకు అక్కడకు చేరే వీలు ఉండదు. సమ్మర్ సెలవలు అందుకే వస్తాయి. ఉన్న ఊళ్లోనివి తెలియని ఊళ్లల్లోనివి చూసి రమ్మంటాయి. పిల్లలూ... పెద్దల వెంటపడండి. బస్సెక్కండి... ఆటో ఎక్కండి... రైలు ఎక్కండి... కానీ ఇవి మాత్రం మిస్ కాకండి. సాలార్జంగ్ మ్యూజియం గంటకోసారి గంటకొట్టే అబ్బాయికి ఆకలెయ్యదా నాన్నా? ఈ ప్రశ్నకు మీ దగ్గర ఆన్సర్ ఉంటుందా? రెబెకాకు ముసుగు ఎవరు కప్పారు? ఏమో! వీటికి సమాధానాలు మీ దగ్గర లేకపోయినా ఏం ఫరవాలేదు. ఓ సారి పిల్లల్ని సాలార్జంగ్ మ్యూజియానికి తీసుకెళ్లండి. అలాగే మీకు దగ్గరున్న ఇతర మ్యూజియాలనూ చూపించండి. కళాజగత్తును, శాస్త్రసాంకేతిక ప్రపంచాన్ని ఏకకాలంలో అర్థం చేసుకుంటారు. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్‌లోని దివాన్దేవుడీలో ఉండేది. ఇప్పుడు దారుషిఫా చౌరస్తాకు సమీపంలో మూసీనది పక్కన 1968లో నూతనంగా నిర్మించిన భవనంలోకి సాలార్జంగ్ మ్యూజియాన్ని మారింది. 1,2,3 సాలార్‌జంగ్‌లు భారతదేశంతో పాటు విదేశాల నుంచి సేకరించిన దాదాపు 48 వేల కళాఖండాలను మ్యూజియంలో పొందుపరిచారు. రెబేకా (పాలరాతి ముసుగు సుందరి), గంటలు కొట్టే గడియారంలతోపాటు చైనా, జపానీస్, యూరోపియన్ పెయింటింగ్‌లతో కూడిన గ్యాలరీలు, అరుదైన కళాఖండాలు మ్యూజియంలో సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఎప్పుడు వెళ్లవచ్చు?: శుక్రవారం సెలవు. మిగిలిన రోజుల్లో ఉదయుం 10 గంటల నుంచి సాయుంత్రం 5 గంటల మధ్య. టిక్కెట్లు: పెద్దలకు -రూ.20, పిల్లలకు-రూ.10 (12 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితం), విదేశీయుులకు- రూ.500. సాలార్జంగ్ మ్యూజియం ఆవరణలో పార్కించ్ చార్జ్... ద్విచక్ర వాహనానికి రూ.5, కారుకు రూ. 30, బస్సుకు, రూ.50. బిర్లా ప్లానిటోరియం నక్షత్రాలు ఆకాశంలోనే ఉంటాయా? గ్రహాలను మనం చూడలేమా? డైనోసార్ మన ఇల్లంత ఉంటుందా? ఇన్నింటికి జవాబుల కోసం బుర్రగోక్కోవడం కంటే ఓసారి ప్లానిటోరియానికి తీసుకెళ్తే సరి. హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియంలో పిల్లలకి సైన్స్ నాలెడ్జ్‌కి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. డైనోసార్‌లో పుట్టుకను శాస్త్ర రీత్యా చూడవచ్చు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన వెలకట్టలేని అంశాలు ఎన్నో ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. శాస్త్రీయ ఆలోచనలు ఒంటపట్టించేందుకు సైన్స్ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు బిర్లా సైన్స్ మ్యూజియం ఓ గొప్ప వేదిక. జీవ పరిణామ క్రమాన్ని తెలియజేసేలా శిలాజాలు, అంతరిక్ష రహస్యాలను అద్దం కంటే ప్లానిటోరియం ప్రదర్శన పిల్లలకు విజ్ఞానదాయకంగా, పెద్దలకు వినోదంగా ఉంటుంది. ఓసారి పిల్లల్ని తీసుకెళ్తే పై ప్రశ్నలకు సమాధానాలు వాళ్లే తెలుసుకుంటారు. అప్పుడు ఆ చిట్టి బుర్రల్లో కొత్త ప్రశ్నలు మొదలవుతాయి. కొత్త క్వశ్చన్ బ్యాంకులన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. బిర్లా ప్లానిటోరియం, మ్యూజియం నౌబత్ పహడ్‌లో... ఖైరతాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కేవలం ఒకటి, రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఎప్పుడు వెళ్లవచ్చు?: వారాంతపు సెలవు లేదు. ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య వెళ్లవచ్చు. ప్రవేశ రుసుము: రూ.80. ఫోన్ నెంబర్లు: 040- 23241067, 23235081. నెహ్రూ జూలాజికల్ పార్కు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు పాతబస్తీ బహదూర్‌పురాలో 380 ఎకరాల సువిశాల వైశాల్యంతో విస్తరించి ఉంది. ఇది అరుదైన వన్యప్రాణులకు అభయారణ్యం. అడవిని పోలిన సపారీ పార్కులతో ఇది వైవిధ్యమైన ప్రాణిప్రపంచం. రంగురంగుల చిలకల ప్రపంచం, వివిధ రకాల కీటకాలశాల, రకరకాల సీతాకోక చిలకలతో సంద ర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తూ ఆలోచింపజేస్తుంది ఈ జూ. దేశంలో పూర్తిగా కనుమరుగవుతున్న ఆసియా సింహాల పరిరక్షణను విజయవంతంగా నిర్వహిస్తోంది ఈ జూ. వాటి పునరుత్పత్తికి దేశంలోనే రికార్డులెక్కిన జూలలో జన్యు ప్రయోగాల ద్వారా తెల్ల పులుల సంతానోత్పత్తి నిలయం అయింది. జీబ్రా, కంగారు వంటి అరుదైన విదేశీ జంతువులు కనుమరుగయ్యాయి. హార్న్‌బిల్, ఫెలికాన్, ప్లెమింగ్ ఘోష్, సారాస్ క్వెన్, లవ్‌బర్డ్స్, తెల్ల చిలకల వంటి అరుదైన పక్షులతో పాటు దేవాంగపిల్లి, జంగిలికాట్, ముళ్ల పంది, కస్తూరి పిల్లులు, ఆసియా సింహాలు, తెల్లపులులు, చిరుత, ఆఫ్రికా సింహం, జాగ్వార్ రకం చిరుత పులి, సరిసృపాల జగత్తులో రస్సల్ ఫైపర్, రాక్ఫైథాస్, లెటిక్యూలేటెడ్ ఫైథాస్ రకాల కొండచిలువలు, ఆఫ్రికన్ చింపాంజి, జంట ఖడ్గమగాలు, నీటి గుర్రాలు ఈ జూకు ప్రత్యేకఆకర్షణ. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఎలా గడిచిపోయిందో తెలియదు. ఎలా వెళ్లాలంటే... నగరంలో అన్ని ప్రదేశాల నుంచి సిటీబస్సులు ఉన్నాయి. ఎప్పుడు వెళ్లాలి?: ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సోమవారం జూకు సెలవు. ప్రవేశ రుసుం: పెద్దలకు రూ.30, చిన్నారులకు రూ.15. బ్యాటరీ వాహనం డ్రైవ్: పెద్దలకు రూ.40, చిన్నారులకు రూ.25. చిట్టి రైలు ప్రయాణం: పెద్దలకు రూ.15, చిన్నారులకు రూ.5లు. బొటానికల్ గార్డెన్..! ప్రకృతి మనకు ఎన్ని చెట్లనిచ్చిందో పిల్లలకు చెప్పడం ఎలా? కష్టం మీద పది పేర్లు చెబితే పదకొండవ చెట్టు పేరు గుర్తు రాదు. గూగుల్ సెర్చ్‌లో చెట్ల పేర్లను వెతకడం మాని బొటానికల్ గార్డెన్ బాట పట్టండి. చెట్లను చూడడంతోపాటు ఆరోగ్యకరమైన గాలని పీల్చుకోవచ్చు. హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్ ఇప్పుడు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉంది. ఇది 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గార్డెన్ అటవీప్రాంతాన్ని తలపిస్తుంది. చూడచక్కనైన చల్లటి వాతావరణం గార్డెన్ సొంతం. దీనిని ‘కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్, కొత్తగూడ’ అంటారు. ఇందులో రోజ్ గార్డెన్, ఎంటర్టైన్ పార్క్ ఉండేవి. వేసవి కారణంగా వాటిని నిర్వహించడం లేదు. పెద్ద పెద్దపార్టీలు, గెట్‌టూ గెదర్స్, ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తారు. దట్టమైన ఆటవీ ప్రాంతంలో ఉండే వృక్షాలను ఇందులో చూడవచ్చు. సైన్స్‌కు సంబంధించి ఎన్నో శాస్త్రీయ నామాలు గల ఔషధమొక్కలు ఇందులో ఉన్నాయి. ఇది సైన్స్ విద్యార్థులకు రిసెర్చ్ కేంద్రం, పర్యాటకులకు వినోదం. పిల్లలకు రోజంతా ఉత్సాహంగా గడపడానికి చక్కటి ప్రదేశం. ‘ఆడుకుంటూ నేర్చుకోవడం’ అంటే ఏమిటో ఇక్కడకు వెళ్తే తెలుస్తుంది. ఎప్పుడు వెళ్లవచ్చు: ఉదయం 9 గం॥నుంచి సాయంత్రం 5 గం॥( ఏప్రిల్, మే నెలల్లో సాయంత్రం 6.30 వరకు). వారాంతపు సెలవులు: లేవు. ప్రతిరోజూ వెళ్లవచ్చు. ప్రవేశ రుసుం: పిల్లలకు రూ.5 , పెద్దలకు రూ. 15. మరిన్ని వివరాలకు: రాజేంద్ర కుమార్, అసిస్టెంట్ ప్లాంటేషన్ మేనేజర్‌ను (9533068033) సంప్రదించవచ్చు. -
సాలార్జంగ్ మ్యూజియంలో ఫోటోల ప్రదర్శన
సాలార్జంగ్ మ్యూజియం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ను మ్యూజియం డెరైక్టర్ డాక్టర్ ఎ. నాగేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. దివాన్‌దేవిడిలో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం విశేషాలను, కట్టడాలను చిత్రాల రూపంలో ఈ ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌కు మ్యూజియంలో పని చేసిన పదవీ విరమణ చేసిన వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వనించారు. మ్యూజియం సంరక్షణకు అప్పట్లో వారు తీసుకున్న చర్యలు, సూచనలు, సలహాలు, వారి పాత జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మ్యూజియం కీపర్ డాక్టర్ కేధారేశ్వరి అప్పటి కళాఖండాల విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్. నాయక్, డాక్టర్ కుసుంతో పాటు మ్యూజియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.