ఇప్పటికీ బహిర్భూమి బయటికేనా? | most of the slum area people in hyderabad do not have nature's call facility | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ బహిర్భూమి బయటికేనా?

Published Tue, Oct 7 2014 1:39 AM | Last Updated on Sat, Oct 20 2018 4:38 PM

ఇప్పటికీ బహిర్భూమి బయటికేనా? - Sakshi

ఇప్పటికీ బహిర్భూమి బయటికేనా?

హైదరాబాద్: భాగ్యనగరంలోని 1,400 మురికివాడల ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కలిగినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానంటూ మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఫిలింనగర్ బసవతారకం నగర్ బస్తీకి చెందిన చిన్నోడు కొక్కుల రాజ్‌కుమార్ అద్భుతంగా ప్రసంగించాడు. సదస్సు సోమవారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. ఇందులో ప్రసంగించే అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాజ్‌కుమార్ బస్తీల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తాడు. బస్తీల్లో జనం పడుతున్న పాట్లను కళ్లకు కట్టినట్టు వివరించాడు. కాలుష్యం పెరిగిపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం, వ్యర్థాల వల్ల తలెత్తే సమస్యలను ప్రపంచ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చాడు. సదస్సులో ఆ బాలుడి ప్రసంగం సాగిందిలా..  ‘హైదరాబాద్‌లోని 1,400 మురికివాడల్లో ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కలిగినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు. సర్ నేనుండేది ఓ మురికివాడలో. మా ఇంటికి వెళ్లాలంటే దారి ఉండదు. వీధి దీపాలు కూడా వెలగవు. చెత్తను రోజూ తీయరు. డ్రైనేజీ పొంగుతుంది. దోమలు స్వైర విహారం చేస్తుంటాయి.
 

ఇది ఒక్క నేను నివసిస్తున్న బస్తీలోనే కాదు. దాదాపు నగరంలోని అన్ని బస్తీల్లోనూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే. మేం ఆడుకోవడానికి ఖాళీ స్థలాలు లేవు. ఎక్కడైనా ఉంటే అవి మలమూత్ర విసర్జనకు, చెత్త డంపింగ్‌కు ఉపయోగిస్తున్నారు. చెత్తను రోజూ తొలగించకపోవడంతో అక్కడ దుర్గంధం పారుతూ నేలలోకి ఇంకుతుంది. దీనివల్ల భూగర్భజలాలతోపాటు భూమి కూడా కలుషితమవుతుంది. చెత్తను తొలగించిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో దుర్వాసన వస్తుంది. దుర్గంధం వల్ల దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. బస్తీల్లో స్తంభాలన్నీ వైర్లతో నిండిపోతున్నాయి. పిల్లలకు అందేంత ఎత్తులో వైర్లు ఉండటంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాం. మేం రోడ్లపైనే ఆడుకోవాల్సి వస్తోంది. బస్తీల్లో ఏదైనా నిర్మాణం చేపడితే తప్పకుండా అక్కడి పిల్లల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జంతువులు చనిపోయిన తర్వాత రోజుల తరబడి అక్కడే వాటి కళేబరాలు ఉంటుండటంతో దుర్గంధం నేలలో ఇంకిపోతుంది.

 

ఇది గాల్లో కూడా కలిసి వాయు కాలుష్యానికి కూడా కారణమవుతుంది. ఇంత పెద్ద నగరంలో వందల కొద్ది బస్తీల్లో ఇప్పటికీ కూడా బహిర్భూమికి బయటికే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడే స్నానాలు చేస్తున్నారు. ఇళ్లన్నీ ఇరుకు సందుల్లో ఉండటంతో సూర్యరశ్మి  ఇంట్లోకి రావడం లేదు. గాలి లేక, వెలుతురు రాక బస్తీ జనం రోగాల బారిన పడుతున్నారు. దోమల నియంత్రణకు రోజూ ఫాగింగ్ చేయాల్సి ఉండగా ఆరు నెలలకోసారైనా ఇటుగా ఎవరూ రావడం లేదు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం తీరుస్తుందన్న నమ్మకం నాకుంది. దయచేసి పిల్లల ఆరోగ్యంపై, బాలల హక్కులపై దృష్టి సారించండి. మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి’ అని రాజ్‌కుమార్ తన ఆవేదనను వెలిబుచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement