‘అనంత’ మ్యూజియం చూసొద్దాం.. రండి
సందర్భం : నేడు మ్యూజియం దినోత్సవం
హాయ్ ఫ్రెండ్స్.. గతకాల వైభవానికి ప్రతీకగా నిలిచిన చరిత్రను తెలుసుకోవాలంటే మనం మ్యూజియంలకు వెళ్లాల్సిందే. గత చరిత్రకు సంబంధించిన విజ్ఞానాన్ని చిన్నారులకు అందించాలనే లక్ష్యంతో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ మ్యూజియంలను నిర్వహిస్తుంటారు. కాలగర్భంలో కలసిపోయిన మన పూర్వీకులు వినియోగించిన వస్తుసామగ్రి, నాటి శాసనాలు, నాణేలు, శిల్పాలను ఇక్కడ మనం చూడవచ్చు. జిల్లా కేంద్రం అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో పురావస్తు శాఖ ప్రదర్శన శాల (మ్యూజియం) మనకు అందుబాటులో ఉంది. ‘మ్యూజియం డే’ని పురస్కరించుకుని గురువారం ఇక్కడ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. రాయలేలిన సీమలోని అనంత ఘన చరిత్రను ఇక్కడ తెలుసుకునేందుకు వీలవుతుంది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమైన గత వైభవాన్ని చాటే పలు సుందరశిల్పాలు, పురాతన విగ్రహాలు, శాసనాలు, నాణేలు ఇక్కడ భద్రపరిచారు. ప్రాచీన యుగానికి చెందిన వస్తువులు, తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన తెలుగులిపిలో వచ్చిన మార్పులు సూచించే పట్టిక, జైన, బౌద్ధ విశేషాలు తెలుసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం... రండి ‘అనంత’ మ్యూజియంను ఒకసారి చూసొద్దాం.
- అనంతపురం కల్చరల్