చూసొద్దాం..
అరుదైన చిత్ర, శిల్ప కళలతో.. ఆధ్యాత్మిక చింతనతో పాటు నేటికీ అంతు చిక్కని సాంకేతిక నైపుణ్యానికి పట్టుకొమ్మగా విరాజిల్లుతోంది లేపాక్షి. సజీవశిల్ప సౌందర్యానికి ప్రతీకగా దేశవిదేశీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి ఆలయంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, జటాయు మోక్షఘాట్, నంది విగ్రహం, ఏడుశిరసుల నాగేంద్రుడు, అంతరిక్ష స్తంభం, సీతమ్మ పాదం, విరుపణ్ణ కళ్లు పెకలించి గోడకు తాపడం చేసిన చోట అంటిన రక్తపు మరకలు, నాట్య మంటపం, లతా మంటపం, కల్యాణమంటపం తదితర విశేషాలు ఎన్నో అబ్బురపరుస్తున్నాయి.
ఇక్కడి ఆలయం పైకప్పును రామాయణ, మహాభారత, మనునీతి, భూకైలాస్, కిరాతార్జునీయం తదితర ఘట్టాలను తైలవర్ణాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ఆలయం వద్ద ఇటీవల శుద్ధి చేసిన కోనేరు, పార్కులు చూడముచ్చటగా ఉన్నాయి. ఆలయంలోని నాట్యమంటపం ఈశాన్య మూలలో నేలను తాకకుండా సుమారు ఎనిమిది అడుగుల స్తంభం పైకప్పు నుంచి నేలను తాకకుండా వేలాడబడి ఉంది. అంతరిక్ష స్తంభం అని పిలువబడుతున్న ఈ వేలాడే స్తంభం గుట్టు తెలుసుకునేందుకు అప్పట్లో దేశాన్ని పాలించిన తెల్లదొరలు నానా అగచాట్లు పడ్డారు. ఇందులోని రహస్యం నేటికీ అంతు చిక్కడం లేదు. ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూపురం చేరుకుని అక్కడి నుంచి తూర్పు దిశగా 14 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడకు నిరంతర బస్సు సౌకర్యం ఉంది.
- లేపాక్షి (హిందూపురం)