చిత్రం చెక్కిలిపై చెదరని సంతకం! | Sheela Veerraju Has A Special Place In The Interpretation Of Lepakshi | Sakshi
Sakshi News home page

చిత్రం చెక్కిలిపై చెదరని సంతకం!

Published Fri, May 31 2024 9:13 AM | Last Updated on Fri, May 31 2024 9:17 AM

Sheela Veerraju Has A Special Place In The Interpretation Of Lepakshi

లేపాక్షిలో... శీలా వీర్రాజు (1968)

1968 మే నెలలో, ఇటువంటి రాళ్ళు పగిలే ఎండల్లోనే ఒక ప్రభుత్వ బృందం అనంతపురం జిల్లా బయలుదేరింది. అక్కడి లేపాక్షి,  తాడిపత్రి తదితర ప్రాంతాలను సందర్శించి అప్పటి ప్రభుత్వ పత్రిక ‘ఆంధ్రప్రదేశ్‌’ లో వ్యాసాలు రాయడానికి, ఒక రిపోర్ట్‌ తయారు చేయడానికని. అందుకోసం ఆ జట్టులో రాసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్లు, బొమ్మలు వేయడానికి కూడా ఒక ఆర్టిస్ట్‌ ఉన్నారు. తెలుగు చిత్రకళ చెదరని సంతకాలలో ఒకరైన శీలా వీర్రాజు (శీలావీ) ఆ బృంద సభ్యుల్లో ఒకరు. ఆయన లేపాక్షి సందర్శన ఒక చిత్రకారుడి హోదాలో కాదు, సమాచారశాఖలో ఒక ఉద్యోగిగా మాత్రమే. అయినా చిత్రకళ మీద ఉన్న అభిరుచి కారణంగా తన స్కెచ్‌ బుక్‌ పట్టుకుని కదిలారు ఆ పురాతన శిథిలాలయ క్షేత్రానికి.

లేపాక్షి చేరి దేవాలయ చరిత్ర గురించి, శిల్పాల గురించి పూజారి చెబుతున్న వివరాలను ఒక చెవిన వింటూ, తన చేతనున్న స్కెచ్‌ బుక్‌ని బొమ్మలతో నింపేశారు శీలావీ. ఆయనకు ఆ దేవతలు, వారి కథలు – గాథలు, భక్తి, కైవల్యం, కైంకర్యం, ఏమీ పట్టలేదు. ఆయన అక్కడ చూసిందల్లా ఆ శిల్పాలనూ, కఠినమైన నల్లరాయికి ఉలి అంచు పరుసవేది తాకించి ఆ రాయీ రప్పా, బండలను వెన్న చేసి శిల్ప మూర్తులుగ మలచిన సంతకం తెలియని కళాకారుడి దప్పి మాత్రమే. పెద్ద శిలను లేపాక్షినందిగా మలచి, దాని మెడను చుట్టిన మంజీర శబ్దాలు మాత్రమే ఆయనకు వినపడ్డాయి.

మోచేయి వంపులో స్కెచ్‌ పుస్తకాన్ని  ఇరికించుకుని గంటల తరబడి బొమ్మను గీస్తే ఏం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎక్కగలిగే కాలి కింది మెట్టుగా పనికి వచ్చేనా? నలుగురు  మనుషుల కళ్ల గుమ్మం గుండా వెళ్ళి గుండెను పలకరించేనా ఆర్ట్‌? కర్ట్‌ వానెగట్‌ అనే అమెరికన్‌ రచయిత బడి పిల్లలకోసం ఒక అద్భుతమైన లేఖను రాశారు. గుండెపొరలలో దాచుకుని పదేపదే తడుముకోవాల్సిన లేఖ అది. ఆ ఉత్తరంలో ఆయన పిల్లలను ఉద్దేశించి అన్నా, మనమందరం నేర్చుకోవలసిన పాఠం ఉంది.

‘నాయనలారా మీరు ఏదైనా కళను అభ్యసించండి. అది పాడటం కావచ్చు. రాయడం కావచ్చు, బొమ్మలు గీయడం కావచ్చు, ఏదయినా కావచ్చు, కానీ కళలను అభ్యసించండి. డబ్బుకోసం,  కీర్తికోసం, పెద్దపేరు కోసం కాదు. అనుభూతి చెందడం, మీలో ఏముందో తెలుసుకోవడం, టు మేక్‌ యువర్‌ సోల్‌ గ్రో వంటివాటి కోసం కళను తెలుసుకోండి’. జీవితాంతం శీలావీ అదే పని చేశారు. ఆయన కళ ద్వారా తన హృదయంలో దీపం వెలిగించుకున్నారు. దీపం దీపాన్ని వెలిగిస్తుంది అని నమ్మారు.

రాయి ప్రకృతిది, రాయిని చెక్కిన ఉలి లోహం ప్రకృతిది. బొమ్మను గీసుకున్న కాగితం ప్రకృతిది; పెన్సిల్‌ ముక్క తాలుకు బొగ్గు, దానిని ఇముడ్చుకున్న కలప ప్రకృతిలో భాగాలే. కాగితం మీద బొమ్మ వేయడం అంటే ప్రకృతి ప్రకృతిని కౌగిలించుకోవడమే. శీలా వీర్రాజు లేపాక్షిలో రెండు రోజులు ఉన్నారు. ఆ రెండు రోజుల్లో దాదాపు యాభై స్కెచ్‌లు గీసుకున్నారు. మండే సూర్యుడి కింద నిలబడి, కాలే రాళ్ళ మీద కూచుని బొమ్మలు గీశారు. ఈ బొమ్మలన్నీ దాదాపుగా 30 సెంటీ మీటర్ల వెడల్పు, 42 సెంటీ మీటర్ల కొలతల్లో వేసిన పెద్ద బొమ్మలు. ఫౌంటైన్‌ పెన్‌ గీతల బొమ్మలివి. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని బొమ్మ వేస్తున్నప్పుడు చిత్రకారుడి చూపు వస్తువు వైపే ఉంటుంది. చేతి వేళ్ళు, ఇంకు పెన్ను ముక్కు మాత్రమే కాగితాన్ని చూస్తుంటాయి.

మంచి చిత్రకారుడి దృష్టి ఏమాత్రం కాగితాన్ని చూడదు. అంత పెద్ద కాగితంపై తొట్రుపడకుండా పరుగెత్తిన వీర్రాజు గీత తీవ్రత మనల్ని విస్మయుల్ని చేస్తుంది. తోటి చిత్రకారులను కొంచెం భయపెడుతుంది కూడా. కేవలం రెండు రోజుల్లో అంత పెద్ద బొమ్మలను, అంత నైపుణ్యంగా వేయడం మాట కాదు అనుకుంటామా, శీలావీ ఇంకోలా అంటారు: ‘నేను అక్కడి శిల్పాలకు మాత్రమే స్కెచ్‌లు గీసుకున్నాను. గోడల మీద, పైకప్పు మీద రంగుల్లో చిత్రించిన పురాతన చిత్రాలు కూడా ఉన్నాయి. అచ్చమైన దేశీయ శైలి చిత్రాలవి. నేను వాటి జోలికి పోలేదు. సమయం చాలకపోవటం ఒక కారణమైతే, తీసుకెళ్లిన స్కెచ్‌ బుక్‌ పూర్తయిపోయి ఆ పల్లెటూళ్ళో డ్రాయింగ్‌ పేపర్లు దొరక్కపోవడం మరో కారణం’. ఈ రోజుల్లోలా విరివిగా దొరికే కాలమై ఉంటే ఈ బొమ్మలు చెప్పే కథ ఇంకోలా ఉండేది.

కాలం గడిచి కథలు కంచికి చేరుతాయి. గాలిపటాన్ని దారం వదిలేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం శీలా వీర్రాజు కాలం చేశారు. ఆయన ఎగురవేసిన గాలిపటాన్ని తెగిపడనీయకుండా ఆయన సహచరి శీలా సుభద్రాదేవి ఎత్తిపట్టుకున్నారు. ఆయన చిత్రించిన ప్రతి బొమ్మల గాలిపటాన్నీ అకాశం ఎత్తుకు తీసుకు వెళ్ళి ప్రపంచానికి చూపించే పని ఆరంభించారు. శీలావీ లేపాక్షి స్కెచ్‌లతో పాటు  రామప్ప, అజంతా–ఎల్లోరా, కోణార్క్‌ స్కెచ్‌లన్నీ కలిపి ఒక పెద్ద గాలిపటమంత పుస్తకం ప్రచురించారు. జూన్‌ ఒకటవ తేదీ శనివారం హైదరాబాదు రవీంద్రభారతిలో ఆ పుస్తక ఆవిష్కరణ, వీర్రాజు గారి సంస్మరణ.
– అన్వర్‌, ఆర్టిస్ట్‌
(హైదరాబాదులో రేపు శీలా వీర్రాజు సంస్మరణ సభ)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement