ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి
ప్రపంచ దేశాల్లోని అశేష భక్త కోటితో ఆధ్మాత్మిక గురువుగా కొలువబడుతున్న సత్యసాయి నడయాడిన పుణ్యభూమి పుట్టపర్తి. ప్రశాంతతకు మారుపేరుగా ప్రశాంతి నిలయంగా పేరొందిన పుట్టపర్తిలో నిత్య ఆధ్యాత్మిక శోభతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సత్యసాయి మహానిర్యాణం అనంతరం రూపుదిద్దుకున్న సత్యసాయి మహాసమాధి, సత్యసాయి నెలకొల్పిన కట్టడాలు, ఆయన జీవిత చరిత్రతో ముడిపడిన అంశాలు ఇక్కడికు వచ్చే పర్యాటకులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి.
ఇక్కడ సత్యసాయి ఆశ్రమం, ప్రశాంతి మందిరంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో అరుదైన పాలరాతితో నిర్మితమైన సత్యసాయి మహాసమాధి, చారిత్రక కట్టడమైన సర్వధర్మ స్థూపం, గడ్డి మైదానాలు, సత్యసాయి చరిత్రను తెలిపే పుస్తక విక్రయశాలలు, ప్రశాంతి నిలయానికి అనుకుని ఉన్న కొండపై మూడు అంతస్తుల్లో నిర్మితమైన సత్యసాయి పూర్వపు మ్యూజియం, సత్యసాయి యూనివర్శిటీ, కొండపై కల్పవృక్షం (చింత చెట్టు), సత్యసాయికి జన్మనిచ్చిన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ పుణ్య దంపతుల సమాధులు, హనుమాన్ సర్కిల్‌లోని శివాలయం, సత్యసాయి నిర్మించిన అద్బుతమైన హిల్‌వ్యూవ్ క్రికెట్ మైదానం, కొండపై 66 అడుగుల హనుమంతుడు, షిరిడీ సాయి, ఏసుక్రీస్తు, శ్రీకృష్ణుడు, బుద్దుడు, జోరాస్టర్‌ల ప్రతిమలు, గోకులం వద్ద సత్యసాయి నిర్మించిన మిరుపురి సంగీత కళాశాల, ఇండోర్ స్టేడియంను చూడవచ్చు. జిల్లా కేంద్రమైన అనంతపురం నుంచి సుమారు 84 కిలోమీటర్లు ప్రయాణించి పుట్టపర్తి చేరుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి.
- పుట్టపర్తి టౌన్