సర్వదేవతల సంగమం.. సంగమేశ్వరం | summer special of sangameswarm | Sakshi
Sakshi News home page

సర్వదేవతల సంగమం.. సంగమేశ్వరం

Published Sat, Jun 3 2017 8:15 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

సర్వదేవతల సంగమం.. సంగమేశ్వరం

సర్వదేవతల సంగమం.. సంగమేశ్వరం

బత్తలపల్లి (ధర్మవరం) : ఎత్తైన కొండలు.. పచ్చదనం సంతరించుకున్న పంట పొలాలు.. ఆహ్లాదకర వాతావరణం నడుమ సర్వదేవతలు కొలువై ఉన్నారు. వివిధ ఆలయాలతో నిండిన ఈ క్షేత్రం సంగమేశ్వరంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం బత్తలపల్లి మండలం అప్రాచెరువు పంచాయతీ పరిధిలో ఉంది. ప్రతి దేవాలయం వద్ద సరస్సులు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా చిత్రావతి, దూబిలేరు, పాలేరు నదులు కలుస్తాయి. ప్రతి సంగమం వద్ద ఈశ్వరాలయం ఉన్నట్లుగానే ఇక్కడా కూడా శివుడిని ప్రతిష్టించారు. ఈ క్షేత్రాన్ని సంగరామేశ్వరంగా కూడా పిలుస్తారు. ఇలాంటివి ఉత్తర భారతదేశంలో దేవ ప్రయాగ, రుద్రప్రయాగ, నందిప్రయాగ, త్రివేణì సంగమంలో ఉన్నాయి. వాటి సరసన ఈ క్షేత్రం కూడా చేరుతుంది.

ఈశ్వరాలయం చరిత్ర :
     సంగమేశ్వరంలోని ఈశ్వరాలయానికి సంబంధించి కొన్ని చారిత్రాత్మక ఆధారాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు పాలనలో ఆస్థాన మంత్రికి భరణంగా ఇచ్చి అప్పాజీ పేరుతో అప్పరాజుచెర్ల గ్రామాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈశ్వరాలయం వెనుక దేవనాగర లిపిలో ఒక శాసనం ఉంది. ఆ శాసనాన్ని ఆర్కియాలజీ శాఖవారు సర్వేచేసి ఈ శాసనం రాయల కాలం నాటిదని తేల్చారు. ఆలయంలోని పంచలింగాలు, ఆలయగోపురం కూడా రాయలనాటి కాలానివే. నదుల సంగమంలో కొన్ని దశాబ్ధాల క్రితం నదులు వెల్లువెత్తి విలయతాండవం చేసినప్పుడు చామండేశ్వరి విగ్రహం బయటపడింది. అది ఇప్పటికీ నదులు కలిసే ప్రాంగణంలో ఉంది. స్థల మహత్యాన్ని బట్టి పంచలింగాల ప్రతిష్ట జరిగింది. ఈ ఈశ్వరాలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలతో పంచలింగాలను అభిషేకిస్తారు. ప్రతియేడాది శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి పర్వదినాల్లో వేడుకలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో విశాలంగా నిర్మించిన సత్రముంది. ఇది వివాహాది శుభకార్యాలకు సౌకర్యంగా ఉంది.

ఎన్నెన్నో ఆలయాలు..
     ఈశ్వరాలయం చుట్టూ గుట్టలు, పెద్దపెద్దరాళ్లు ఉండేవి. ఆ ప్రదేశంలో ఇద్దరు అవధూతలు తిరుగుతుండేవారు. వారిని ప్రజలు తిక్కమల్లప్ప, ఎర్రిచెన్నప్పలుగా పిలిచేవారు. గుట్టపై రామాలయాన్ని నిర్మించి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కొందరు వ్యక్తులు వస్తారని వారు జోస్యం చెప్పారట. వారి జోస్యం ఫలించి రామకృష్ణానందస్వామి ఈ క్షేత్రానికి వచ్చి మహాయజ్ఞం నిర్వహించి రామాలయం నిర్మించినట్లు చెబుతారు. 1974లో రామకోటి మహాయజ్ఞం జరిగింది. సకల వెంకటసుబ్బమ్మ, రంగలమ్మ ఆర్థికసాయంతో శ్రీసీతారామలక్ష్మణ, హనుమాన్‌ విగ్రహాలను ప్రతిష్టించారు. అదేవిధంగా దేవాలయ నిర్మాణానికి రావులచెరువు రామిరెడ్డి ఎంతో సహాయం చేశారు. రామాలయం పక్కనున్న గుట్టపై శ్రీవెంకటేశ్వస్వామి, పద్మావతిదేవీ ఆలయాలను కూడా విరాళాలతో నిర్మించారు. శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం వెనుకనే శ్రీరామకోటి స్థూపం ఉంది. ఇంకా ఈక్షేత్రంలో నవగ్రహాలు, చిన్నచిన్న దేవాలయాలున్నాయి. పచ్చని చెట్లనడుమ ఎల్తైన గుట్టపై కొన్ని ఆలయాలు, కళ్యాణమండపాలు నిర్మించారు. ఈ ప్రదేశం భక్తులను ఎంతో ఆకర్షిస్తోందని చెప్పవచ్చు.

ఎలా వెళ్లాలంటే : ఈ క్షేత్రానికి వెళ్లాలంటే బత్తలపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ధర్మవరం నుంచి పది కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఆటోలలో వెళ్లవచ్చు. బస్సు సౌకర్యం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement