
చరిత్ర పుటల్లో విదురాసత్త్వం
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న విదురాసత్థ్వం ఆధ్యాత్మికకు ప్రతిరూపంగానే కాదు.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో తెల్లదొరలనెదిరించి అసువులు బాసిన అమరుల నెత్తుటి ధారలతో తడిసిన పుణ్యభూమిగా ఖ్యాతిగడించింది. అనంతపురం నుంచి 130 కిలోమీటర్ల దూరంలోని హిందూపురం మీదుగా మరో 18 కిలోమీటర్లు బెంగళూరు రహదారిపై ప్రయాణిస్తే విదురాసత్థ్వం వస్తుంది. 1938 ఏప్రిల్ 25న ధ్వజ సత్యగ్రహంలో భాగంగా విదురాసత్థ్వం వద్ద 30 మంది స్థానిక యువత బ్రిటీష్ సైనికులను అడ్డుకుంటారు. ఆ సమయంలో ఆంగ్లేయులు తుపాకీలతో గుళ్ల వర్షం కురిపించడంతో వారు అసువులు బాసారు.
వీరిలో ఓ గర్భిణి కూడా ఉన్నారు. ఇప్పటికీ వారి సమాధులు అక్కడ ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే మహాభారత సంగ్రామం తర్వాత విదురుడు వైరాగ్యంతో ఈ ప్రాంతానికి చేరుకుని తపోదీక్షలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పెన్నానదిలో కొట్టుకువచ్చిన అశ్వత్థ వృక్షం కొమ్మను తీసుకెళ్లి అతను నాటి దానిని పెంచి పోషించడంతో ఈ ప్రాంతానికి విదరాసత్థ్వం అనే పేరు వచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఇక్కడ ఉన్న అశ్వత్థనారాయణస్వామి ఆలయం చుట్లూ వందలాది నాగశిలలను ప్రతిష్టించారు. దేశవ్యాప్తంగా యాత్రికులు ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా చేయడం వల్ల నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
- హిందూపురం అర్బన్