
రాయలేలిన ‘దుర్గం’
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. అయినా ఆ నాటి మధుర జ్ఞాపకాలు మాత్రం కనువిందు చేస్తున్నాయి. రాయలు ఏలిన దుర్గంగా రాయదుర్గం చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించే రోజుట్లో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేశారు. నాడు వారు నిర్మించిన ఆలయాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. రాయదుర్గం కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణ స్వామి, జంబుకేశ్వర స్వామి, విశిష్ట దశభుజ గణపతి, కొండపై లక్ష్మీ నరసింహస్వామి, కోదండ రామస్వామి, మాధవరాయస్వామి, రస సిద్ధేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర చారిత్రక కట్టడాలను ఇక్కడ చూడవచ్చు.
పట్టణంలోని బళ్లారి రోడ్డులో అపురూపమైన పాదరస శివలింగాన్ని దర్శించుకోవచ్చు. సతీసహగమనానికి ప్రతీకగా నిలిచిన లక్షుమమ్మ సమాధి కూడా ఇక్కడ ఉంది. జిల్లా కేంద్రం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గంకు ప్రతి గంటకు ఒక బస్సు చొప్పున అనంతపురం ఆర్టీసీ బస్టాండు నుంచి బయలుదేరుతుంటాయి. ఇక్కడ ఉండేందుకు మంచి వసతి సౌకర్యాలు ఉన్నాయి.
- రాయదుర్గం టౌన్