రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా ఎప్పటిలానే పరిగెట్టడానికి వార్మప్ అవుతోంది. కరోనా వల్ల ఈ ఏడాది సమ్మర్‌లో థియేటర్స్‌లోకి ఒక్క సినిమా రాలేదు. సమ్మర్ అంటేనే సినిమాకు పెద్ద పండగ. మనం జరుపుకునే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్. వారం తర్వాత వారం కొత్త సినిమా థియేటర్స్‌లోకి వస్తూనే ఉంటుంది. కానీ సినిమాలను ల్యాబుల్లోనూ, ప్రేక్షకులను ఇళ్లల్లోనూ కట్టిపారేసింది కరోనా.
దాంతో సినిమా సీజన్ లేకుండానే సమ్మర్ గడిచిపోతోంది. ఇంకా ఎన్నాళ్లిలా? అనుకుంటున్న సమయంలో ‘ఇంకొన్ని రోజుల్లో షూటింగులు మొదలుపెట్టుకోవచ్చు’ అనే మాట కూసింత ఊరట అయింది. సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. మొదలవ్వాల్సిన సినిమాలు, మధ్య వరకూ వచ్చి ఆగిన సినిమాలు, ఇంకా పదీ పదిహేను శాతం చేస్తే చాలనే స్థితిలో ఉన్న సినిమాల పనులు త్వరలో తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఏయే సినిమా షూటింగ్ ఎంత శాతం బాకీ ఉంది? ఆ షూటింగ్ మీటర్ మీకోసం.
ఇలా మొదలై...
లాక్‌డౌన్‌కు ముందు కొన్ని సినిమాలు ప్రారంభమయ్యాయి. ఇలా షూటింగ్ మొదలైందో లేదో అలా లాక్‌డౌన్ వాటి ప్రయాణాన్ని ఆపింది. జస్ట్ పదీ పదిహేను రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మొదలైన సినిమా షూటింగ్ పదమూడు రోజులు మాత్రమే జరిగింది. అలాగే అల్లు అర్జున్ నటిస్తోన్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. కేరళలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఆరు రోజులు జరిగింది.
‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. వరుణ్‌తేజ్ తొలిసారి ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో 15 రోజుల పాటు జరిగింది. నాగశౌర్య హీరోగా సౌజన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ పది రోజులే జరిగింది. మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక షూటింగ్ మొదలుపెడదామనుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆగింది. ఇంకా ఐదూ పది శాతం మాత్రమే షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఇంకొన్ని ఉన్నాయి.
గమనిక: ఏయే సినిమా ఎంత శాతం షూటింగ్ బాకీ ఉందో ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ మీద జతపరిచాం. ఇండస్ట్రీ విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఇచ్చిన డేటా ఇది.
Comments
Please login to add a commentAdd a comment