shootings bundh
-
కళాతపస్వికి నివాళులు.. షూటింగ్స్ బంద్ చేస్తూ నిర్ణయం
కళాతపస్వీ కె. విశ్వనాథ్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా సినిమా నేడు జరగనున్న అన్ని షూటింగులు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. స్వచ్చందంగానే షూటింగులను నిలిపివేసినట్లు తెలిపింది. -
ఇక షూటింగ్‌కి అనుమతి లేదు
కోవిడ్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్ చేశారు. అక్కడి లొకేషన్స్‌లో షూటింగ్ ఆరంభించారు. అయితే దర్శక–నిర్మాతలకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇకపై గోవాలో సినిమాలు, సీరియల్స్ చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చేది లేదని ఈఎస్జీ (ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా) స్పష్టం చేసింది. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్‌కి మేం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు, సీరియల్స్ల చిత్రయూనిట్స్కు వీలైనంత త్వరగా షెడ్యూల్ ప్యాకప్ చెప్పాలని ఆదేశాలు జారీ చేశాం. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు షూటింగ్‌లు రద్దు నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తూనే ఉంటాం’’ అని ఈఎస్జీ ప్రతినిధులు పేర్కొన్నారు. -
షూటింగ్స్ బంద్
ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని పలువురు హిందీ స్టార్స్ క్వారంటైన్ లో టైమ్ గడుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటీవలే థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో రిలీజ్‌కు దగ్గరైన సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా సినిమా, టీవీ షూటింగ్స్‌ను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘బ్రేక్ ది చైన్ ’ పేరుతో ఏప్రిల్ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు లాక్డౌన్ విధించించి, కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కోవిడ్ జాగ్రత్తల నడుమ జరుగుతున్న కొద్ది సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోనున్నాయి. షారుక్ ఖాన్ ‘పఠాన్ ’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, అమితాబ్‌బచ్చన్ – రష్మికల ‘గుడ్ బై’ , కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలతో పాటు ముంబయ్‌లో జరుగుతున్న ఇతర సినిమాల షూటింగ్స్‌కి కూడా బ్రేక్ పడింది. ‘‘మేం అన్ని రూల్స్ పాటిస్తున్నాం. అయినా షూటింగ్స్ కారణంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని అనుకోవడం లేదు. త్వరలో ప్రభుత్వాన్ని కలిసి షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటాం’’ అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ పేర్కొన్నారు. -
పారితోషికం తగ్గించుకోవాలి
కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెద్ద స్థాయి హీరోలు, సాంకేతిక నిపుణులు వారి పారితోషికాన్ని తగ్గించుకునే ఆలోచన చేయాలని కోరుతున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఇటీవల ఓ వెబి నార్లో పాల్గొన్న మణిరత్నం ఈ విషయంపై స్పందిస్తూ –‘‘థియేట్రికల్ బిజినెస్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంత వరకు స్టార్ హీరోలు, పెద్ద టెక్నీషియన్లు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది’’ అని అన్నారు. ఇక తన డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ గురించి మణిరత్నం మాట్లాడుతూ – ‘‘పదో శతాబ్దం నేపథ్యంలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఆ కాలంనాటి సినిమా కాబట్టి పెద్ద సైన్యాలతో కూడిన యుద్ధ సన్నివేశాలు తప్పక ఉండాలి. కానీ కరోనా వల్ల ఆ సన్నివేశాల చిత్రీకరణ కుదిరేలా లేదు. అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాయంతో ఆ వార్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేస్తున్నాను’’ అని అన్నారు. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల ముఖ్య తారాగణంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. -
మేకప్.. మేకోవర్!
‘‘రంగేయడానికి ఒకళ్లు.. జడేయడానికి ఒకళ్లు.. బాగానే ఉంది దర్జా.. హ్హహ్హహ్హ’’.... ‘మహానటి’ సినిమాలోని డైలాగ్ ఇది. సావిత్రి పాత్రధారి కీర్తీ సురేషకి మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేసి, హెయిర్ స్టయిలిస్ట్ హెయిర్ స్టయిల్ చేసేటప్పుడు ఆమె పెదనాన్న పాత్రధారి రాజేంద్రప్రసాద్ ఈ డైలాగ్ అంటారు. షూటింగ్ ఉంటే అంతే.. సహాయకులు చాలామంది ఉంటారు. ఈ లాక్డౌన్లో షూటింగ్‌లు బంద్. ఇంట్లో ఉంటున్న తారలు ‘నో మేకప్’ అంటున్నారు. సీరత్ కపూర్ కూడా అలానే అనుకున్నారు. కానీ సొంతంగా మేకప్ చేసుకోగలమా? అని డౌట్ వచ్చినట్లుంది. అందుకే సొంత మేకప్ ప్రయత్నించారు. సీరత్ జుట్టు వంకీలు తిరిగి ఉంటుంది. ముందు ఆ జుట్టుని స్ట్రెయ్టినింగ్ చేశారు. ఆ తర్వాత ఓ కొత్తరకం హెయిర్ స్టయిల్ చేసుకుని, మేకప్ చేసుకున్నారు. ఇక లాక్డౌన్ టైమ్ గురించి సీరత్ మాట్లాడుతూ – ‘‘ఇల్లనేది అందమైన కవిత లాంటిదని నా ఫీలింగ్. కవితలో రాసేవన్నీ బాగుండాలనుకుంటాం. అలాగే ఇల్లంతా బాగుండాలని కోరుకుంటాను. ఇంటికి సంబంధించినవన్నీ స్వయంగా నేనే కొన్నాను. ఈ ఖాళీ సమయంలో ప్రతిదీ శుభ్రం చేస్తున్నాను. అయినా ఇంకా ఎంతో కొంత టైమ్ మిగులుతోంది. అందుకే సరదాగా సొంత మేకప్, కొత్త హెయిర్ స్టయిల్ ప్రయత్నించాను. షూటింగ్స్ బాగా మిస్సవుతున్నాననిపిస్తోంది’’ అన్నారు. మేకప్ చేసుకోవడమే కాదు.. మేకోవర్ మీద కూడా దృష్టి పెట్టారు సీరత్. ఆ విషయం గురించి సీరత్ మాట్లాడుతూ –‘‘ఆరోగ్యకరమైన పద్ధతిలో సన్నబడుతున్నాను. ‘ఈఎమ్ఎస్’ (ఎలక్ట్రో మజిల్ స్టిములేషన్) ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వారానికి రెండుసార్లు 20 నిముషాలు ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఇది వారానికి మూడుసార్లు చేసే ‘స్ట్రెంత్ ట్రైనింగ్’కి సమానంగా ఉంటుంది. ఈఎమ్ఎస్ కాకుండా పైలెట్స్ చేస్తాను. ఇప్పుడు ఇంటి పనులు కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం బరువు తగ్గడానికి చాన్స్ ఉంటుంది. హెల్తీ డైట్ ఫాలో అవుతున్నాను’’ అన్నారు. తెలుగులో ‘రన్ రాజా రన్’, ‘టైగర్’, ‘రాజుగారి గది 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే నటనను కనబరిచారు సీరత్. ఆమె నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ విడుదలకు సిద్ధమవుతోంది. -
బాకీ ఎంత?
రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా ఎప్పటిలానే పరిగెట్టడానికి వార్మప్ అవుతోంది. కరోనా వల్ల ఈ ఏడాది సమ్మర్లో థియేటర్స్‌లోకి ఒక్క సినిమా రాలేదు. సమ్మర్ అంటేనే సినిమాకు పెద్ద పండగ. మనం జరుపుకునే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్. వారం తర్వాత వారం కొత్త సినిమా థియేటర్స్‌లోకి వస్తూనే ఉంటుంది. కానీ సినిమాలను ల్యాబుల్లోనూ, ప్రేక్షకులను ఇళ్లల్లోనూ కట్టిపారేసింది కరోనా. దాంతో సినిమా సీజన్ లేకుండానే సమ్మర్ గడిచిపోతోంది. ఇంకా ఎన్నాళ్లిలా? అనుకుంటున్న సమయంలో ‘ఇంకొన్ని రోజుల్లో షూటింగులు మొదలుపెట్టుకోవచ్చు’ అనే మాట కూసింత ఊరట అయింది. సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. మొదలవ్వాల్సిన సినిమాలు, మధ్య వరకూ వచ్చి ఆగిన సినిమాలు, ఇంకా పదీ పదిహేను శాతం చేస్తే చాలనే స్థితిలో ఉన్న సినిమాల పనులు త్వరలో తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఏయే సినిమా షూటింగ్ ఎంత శాతం బాకీ ఉంది? ఆ షూటింగ్ మీటర్ మీకోసం. ఇలా మొదలై... లాక్‌డౌన్‌కు ముందు కొన్ని సినిమాలు ప్రారంభమయ్యాయి. ఇలా షూటింగ్ మొదలైందో లేదో అలా లాక్డౌన్ వాటి ప్రయాణాన్ని ఆపింది. జస్ట్ పదీ పదిహేను రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదలైన సినిమా షూటింగ్ పదమూడు రోజులు మాత్రమే జరిగింది. అలాగే అల్లు అర్జున్ నటిస్తోన్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. కేరళలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఆరు రోజులు జరిగింది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ఇది. వరుణ్‌తేజ్ తొలిసారి ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో 15 రోజుల పాటు జరిగింది. నాగశౌర్య హీరోగా సౌజన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ పది రోజులే జరిగింది. మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక షూటింగ్ మొదలుపెడదామనుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఆగింది. ఇంకా ఐదూ పది శాతం మాత్రమే షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఇంకొన్ని ఉన్నాయి. గమనిక: ఏయే సినిమా ఎంత శాతం షూటింగ్ బాకీ ఉందో ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ మీద జతపరిచాం. ఇండస్ట్రీ విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఇచ్చిన డేటా ఇది. -
పేద సినీ కార్మికులకు సహాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ (సీసీసీ) ప్రారంభించారు. నటీనటుల సహా పలువురు దాతల నుంచి సీసీసీకి విరాళాలు వెల్లువెత్తాయి. ముందే ప్రకటించినట్లు ఈ ఆదివారం నుంచి 24 శాఖల్లోని పేద కార్మికులకు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్ బృందం నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ –‘‘సినీపరిశ్రమలోని ప్రతి కార్మికుడి ఇంటికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నాం. అందులో భాగంగా ఆదివారం స్టూడియోస్ విభాగం కార్పెంటర్స్కి సరుకులు అందించాం. నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ప్రతి నెలా సరుకులు కార్మికుల ఇంటికే చేరతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త అయిన చిరంజీవిగారితో సహా దాతలందరికీ కృతజ్ఞతలు. ‘సీసీసీ మనకోసం’ కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ , బెనర్జీ.. ఇలా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అన్నారు. -
కుకింగ్.. క్లీనింగ్
కోవిడ్ 19 (కరోనావైరస్)తో దేశవ్యాప్తంగా థియేటర్స్, షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా తారలందరూ హోమ్ క్యారంటైన్లో ఉన్నారు. షూటింగ్స్, ప్రమోషన్స్ ఎప్పుడూ బిజీగా ఉండే వీరికి కాస్త ఖాళీ సమయం దొరకడంతో రోటిన్‌కి భిన్నంగా ఎవరికి వారు తమకు తోచిన పనిలో నిమగ్నమైపోయారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే గరిటె తిప్పే పనిలో పడిపోయారు. బెండాకాయ వేపుడు చేశారు ఇలియానా. హౌస్ క్లీనింగ్ పనిలో పడిపోయారు తాప్సీ. ఓ చైనీస్ వంటకం చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ తన తండ్రి (అజయ్ శర్మ) కోసం స్వయంగా కేక్ చేశారు. వర్కౌట్‌కి సై అన్నారు సన్నీ లియోన్. చీపురు పట్టుకుని గార్డెను క్లీన్ చేశారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. షూటింగ్‌కి బదులుగా కుకింగ్.. క్లీనింగ్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు తారలు. అనుష్కాశర్మ చేసిన కేక్, ఆదిత్యారాయ్ కపూర్, ఇల్లు క్లీన్ చేస్తున్న తాప్సీ ఇలియానా చేసిన కూర, సన్నీలియోన్, వరలక్ష్మీ చేసిన చైనీస్ డిష్ -
పేద కళాకారులకు అండగా జీవిత–రాజశేఖర్
కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్‌లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఏరోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’లో (మా) కొందరు ఉన్నారు. అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించనున్నట్లు హీరో డా.రాజశేఖర్– జీవితా రాజశేఖర్ ప్రకటించారు. నిరుపేద కళాకారులు 90108 10140 నంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు అందించి తగు సహాయం పొందాలని కోరారు. -
చెక్ మేట్
పని లేని మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలకు కొలువు అంటారు. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మెదడుకి మేత పెట్టారు దేవరకొండ బ్రదర్స్. చెస్ బోర్డ్ తీసి ఒకరికొకరు చెక్ పెట్టుకున్నారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ లేకపోవడంతో స్టార్స్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. తమ హాబీలతో కాలక్షేపం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో సరదాగా చెస్ ఆడుతున్న ఫొటోను షేర్ చేశారు. -
త్వరలో మా ఏపీ ఎన్నికలు
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నాం’’ అని ‘మా–ఏపీ’ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ‘మా–ఏపీ’ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘మా–ఏపీ’ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, సెక్రటరీలు అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ.. మిగతా కార్యవర్గ సభ్యులు తమ రాజీనామాలను అందజేయవచ్చు.. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక నామినేషన్లు వేసుకోవచ్చు. ఈసారి ‘మా–ఏపీ’ అధ్యక్ష స్థానానికి ఒక ప్రముఖ హీరో బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ‘మా–ఏపీ’లో శాశ్వత సభ్యత్వం గల సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. తాత్కాలిక సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై రాష్ట్రాలకు చెందినవారు పోటీ చేయవచ్చు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెల 31 వరకు ఏపీలో షూటింగ్‌లు నిలిపివేశాం. ఎవరైనా షూటింగ్‌లు జరిపితే శాశ్వత సభ్యత్వాలను రద్దు చేస్తాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకులు శ్రీధర్, రత్నాకర్, స్టోరీ బోర్డు సభ్యుడు అశోక్ వడ్లమూడి, ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
31 వరకు షూటింగ్స్ బంద్
కరోనా కారణంగా సినిమాల షూటింగ్స్ని నిలిపివేస్తున్నట్లు ఈ నెల 15న తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. 24 శాఖలు తమ విధులను ఈ నెల 21 వరకు తక్షణం ఆపేయాల్సిందిగా మండలి కోరింది. ఇప్పుడు 24 శాఖల వారితో సంప్రదించి మరో కీలక నిర్ణయాన్ని శుక్రవారం విడుదల చేశారు. 21 వరకు పెట్టిన రద్దును మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తుర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు పేర్కొన్నారు. -
థియేటర్స్ క్లోజ్.. షూటింగ్స్ బంద్!
తమిళనాడులో ఈ నెల 16నుంచి థియేటర్స్‌ను క్లోజ్ చేస్తున్నట్లు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది. ఈ బంద్ గురించిన మీటింగ్ చెన్నైలో జరిగింది. విశాల్, ప్రకాశ్‌రాజ్, నిర్మాత కదిరేశన్ తోపాటు పలువురు సినీప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేవలం థియేటర్స్‌ను మూయడం మాత్రమే కాదు షూటింగ్స్ని కూడా ఆపేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే, ఎలాంటి సినీ వేడుకలు జరపకూడదని కూడా నిర్ణయించారట. ‘‘నిర్మాతల శ్రేయస్సు కొరకు కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం. ఇవి పరిష్కారం అయ్యేవరకు సినిమా షూటింగ్‌లను కూడా నిలిపి వేయదలచాం’’ అని నిర్మాతల మండలి పేర్కొంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తో పాటు, తమిళ్నాడు థియేటర్స్ అసోసియేషన్ కూడా కొన్ని డిమాండ్స్ చేసింది. ‘‘విజువల్ ప్రింట్ ఫీజును నిర్మాతలు (యూఎఫ్ఓ, క్యూబ్) డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు చెల్లించరు. ఫిల్మ్ స్టార్ వేల్యూను అనుసరించి టిక్కెట్ ధరల్లో మార్పులు ఉండాలి. ఆన్లైన్ టిక్కెట్ చార్జీలను తగ్గించాలి. కంప్యూటరైజ్డ్ టిక్కెట్ బుక్కింగ్ సౌకర్యాన్ని అన్ని «థియేటర్స్‌లో ఏర్పాటు చేయాలి. స్మాల్ స్కేల్ మూవీస్ రిలీజ్‌కు వెసులుబాటు కలిగించాలి’’ అని మరికొన్ని డిమాండ్స్ చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం కావడంతో బంద్ విరమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ చిత్రసీమ బంద్‌కి పిలుపునిచ్చింది. ఈ నెల 16 లోపు తమ డిమాండ్స్‌ను అంగీకరిస్తే నిర్మాతల మండలి, థియేటర్స్ అసోసియేషన్ బంద్‌ను విరమించుకోవాలని అనుకుంటున్నారు. -
నేటి నుంచి సమ్మె షురూ!
‘‘గురువారం నుంచి స్ట్రయిక్ చేయడం ఖాయం. ఈ విషయాన్ని మేం ఫిల్మ్‌చాంబర్‌కు తెలిపాం’’ అని ఏ.పి. చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షులు కొమర వెంకటేశ్ వెల్లడించారు. వేతనాల విషయంలో చిన్న చిత్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరడం, ఫెడరేషన్ సభ్యులు కాని వారితోనైనా పని చేయించుకునే హక్కు నిర్మాతలకుందనీ ఫిల్మ్‌చాంబర్ పేర్కొనడం సరికాదని వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ -‘‘చిన్న చిత్రాలకైనా, పెద్ద చిత్రాలకైనా కార్మికుల కష్టం ఒకటే. ఇంకా చెప్పాలంటే, పెద్ద చిత్రాలను ఎక్కువ రోజుల్లో తీస్తారు కాబట్టి, రోజుకి తక్కువ సన్నివేశాలే తీస్తారు. కానీ, చిన్న చిత్రాలను తక్కువ రోజుల్లో పూర్తి చేయాలనుకుంటారు గనక, రోజుకి ఎక్కువ సన్నివేశాలు తీస్తారు. ఆ విధంగా చిన్న చిత్రాలకే ఎక్కువ కష్టం ఉంటుంది. కోటి రూపాయల్లోపు తీసేవి మాత్రమే చిన్న చిత్రాలు. కానీ, మూడు నుంచి ఐదు కోట్ల లోపు నిర్మించేవి చిన్న చిత్రాలుగా పరిగణిస్తున్నారు. అది సరికాదు. ఎవరితోనైనా పని చేయించుకోవాలనుకున్నప్పుడు మాతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఎందుకు? 24 శాఖల్లోని వారినే తీసుకోవాలన్నది మా డిమాండ్’’ అని చెప్పారు. దేశం మొత్తం మీద చూస్తే, తెలుగునాటే వేతనాలు బాగున్నాయని కొంతమంది అనడం గురించి ఆయన స్పందిస్తూ -‘‘అది నిజం కాదు. ముంబయ్‌లో ఉదయం ఆరు నుంచి రెండు గంటల వరకు మాత్రమే ఓ కాల్షీట్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు ఓ కాల్షీట్. అంటే ముంబయ్‌లో ఒక్క కాల్షీట్ పనికి ఇచ్చే వేతనం ఇక్కడ రెండు కాల్షీట్స్ పనిచేస్తే ఇస్తున్నట్లు లెక్క’’ అని వివరించారు. -
రేపు సినిమా షూటింగులు బంద్
సినిమా షూటింగులన్నింటినీ గురువారం నాడు బంద్ చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహించాలని ఫిల్మ్ ఫెడరేషన్ కోరింది. ఇతరులు సినిమా షూటింగులలో పాల్గొంటే సహించేది లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. వేతనాలు పెంచాల్సిందిగా సినీ కార్మికులు ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్నా, ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదని ఫెడరేషన్ నాయకులు తెలిపారు.