తమిళనాడులో ఈ నెల 16నుంచి థియేటర్స్‌ను క్లోజ్ చేస్తున్నట్లు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలిపింది. ఈ బంద్ గురించిన మీటింగ్ చెన్నైలో జరిగింది. విశాల్, ప్రకాశ్‌రాజ్, నిర్మాత కదిరేశన్ తోపాటు పలువురు సినీప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేవలం థియేటర్స్‌ను మూయడం మాత్రమే కాదు షూటింగ్స్‌ని కూడా ఆపేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే, ఎలాంటి సినీ వేడుకలు జరపకూడదని కూడా నిర్ణయించారట. ‘‘నిర్మాతల శ్రేయస్సు కొరకు కొన్ని డిమాండ్స్ చేస్తున్నాం.
ఇవి పరిష్కారం అయ్యేవరకు సినిమా షూటింగ్‌లను కూడా నిలిపి వేయదలచాం’’ అని నిర్మాతల మండలి పేర్కొంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌తో పాటు, తమిళ్‌నాడు థియేటర్స్ అసోసియేషన్ కూడా కొన్ని డిమాండ్స్ చేసింది. ‘‘విజువల్ ప్రింట్ ఫీజును నిర్మాతలు (యూఎఫ్‌ఓ, క్యూబ్) డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు చెల్లించరు. ఫిల్మ్ స్టార్ వేల్యూను అనుసరించి టిక్కెట్ ధరల్లో మార్పులు ఉండాలి. ఆన్‌లైన్ టిక్కెట్ చార్జీలను తగ్గించాలి.
కంప్యూటరైజ్డ్ టిక్కెట్ బుక్కింగ్ సౌకర్యాన్ని అన్ని «థియేటర్స్‌లో ఏర్పాటు చేయాలి. స్మాల్ స్కేల్ మూవీస్ రిలీజ్‌కు వెసులుబాటు కలిగించాలి’’ అని మరికొన్ని డిమాండ్స్ చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం కావడంతో బంద్ విరమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ చిత్రసీమ బంద్‌కి పిలుపునిచ్చింది. ఈ నెల 16 లోపు తమ డిమాండ్స్‌ను అంగీకరిస్తే నిర్మాతల మండలి, థియేటర్స్ అసోసియేషన్ బంద్‌ను విరమించుకోవాలని అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment