నేటి నుంచి సమ్మె షురూ!
‘‘గురువారం నుంచి స్ట్రయిక్ చేయడం ఖాయం. ఈ విషయాన్ని మేం ఫిల్మ్‌చాంబర్‌కు తెలిపాం’’ అని ఏ.పి. చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షులు కొమర వెంకటేశ్ వెల్లడించారు. వేతనాల విషయంలో చిన్న చిత్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరడం, ఫెడరేషన్ సభ్యులు కాని వారితోనైనా పని చేయించుకునే హక్కు నిర్మాతలకుందనీ ఫిల్మ్‌చాంబర్ పేర్కొనడం సరికాదని వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ -‘‘చిన్న చిత్రాలకైనా, పెద్ద చిత్రాలకైనా కార్మికుల కష్టం ఒకటే.
ఇంకా చెప్పాలంటే, పెద్ద చిత్రాలను ఎక్కువ రోజుల్లో తీస్తారు కాబట్టి, రోజుకి తక్కువ సన్నివేశాలే తీస్తారు. కానీ, చిన్న చిత్రాలను తక్కువ రోజుల్లో పూర్తి చేయాలనుకుంటారు గనక, రోజుకి ఎక్కువ సన్నివేశాలు తీస్తారు. ఆ విధంగా చిన్న చిత్రాలకే ఎక్కువ కష్టం ఉంటుంది. కోటి రూపాయల్లోపు తీసేవి మాత్రమే చిన్న చిత్రాలు. కానీ, మూడు నుంచి ఐదు కోట్ల లోపు నిర్మించేవి చిన్న చిత్రాలుగా పరిగణిస్తున్నారు. అది సరికాదు. ఎవరితోనైనా పని చేయించుకోవాలనుకున్నప్పుడు మాతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఎందుకు? 24 శాఖల్లోని వారినే తీసుకోవాలన్నది మా డిమాండ్’’ అని చెప్పారు.
దేశం మొత్తం మీద చూస్తే, తెలుగునాటే వేతనాలు బాగున్నాయని కొంతమంది అనడం గురించి ఆయన స్పందిస్తూ -‘‘అది నిజం కాదు. ముంబయ్‌లో ఉదయం ఆరు నుంచి రెండు గంటల వరకు మాత్రమే ఓ కాల్షీట్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు ఓ కాల్షీట్. అంటే ముంబయ్‌లో ఒక్క కాల్షీట్ పనికి ఇచ్చే వేతనం ఇక్కడ రెండు కాల్షీట్స్ పనిచేస్తే ఇస్తున్నట్లు లెక్క’’ అని వివరించారు.