
సీపీఎం నేత రాఘవులు అరెస్ట్
–ఎన్‌పీకుంట సోలార్‌ప్లాంట్ బాధితులకు మద్దతుగా ఆందోళన
–పోలీసులకు, సీపీఎం నేతల మధ్య తోపులాట
–సీపీఎం నాయకుడి కాలు విరగ్గొట్టిన పోలీసులు
–సీఐ రవికుమార్‌ను అరెస్ట్ చేయాలని స్టేషన్‌లో నిరసన
కదిరి : రైతులకు పరిహారం ఇవ్వకుండానే చేపడుతున్న సోలార్ ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి రైతుల పక్షాన వెళ్లిన సీపీఎం జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌తో సహా పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట మండలంలో గురువారం జరిగిన ఈ సంఘటన కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. మండల కేంద్రంలో బహిరంగ సభ ముగిసిన వెంటనే ప్రాజెక్టు వద్దకు ర్యాలీగా బయలుదేరారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకష్ణ కాలు విరిగింది. జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ను సైతం పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. కదిరి రూరల్ సీఐ రవికుమార్ దగ్గరుండి ఆదేశించడంతోనే పోలీసులు తమపై దాడి చేశారని, ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ రాఘవులతో పాటు వారంతా ఎన్‌పీకుంట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిరసనకు దిగారు. సుమారు రెండు గంటల పాటు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. గాయపడి కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించిన రామకష్ణను సీపీఎం నేత రాఘవులతో పాటు వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, ఇతర నాయకులు పరామర్శించారు.
చంద్రబాబుకు రాజకీయ సమాధే : రాఘవులు
‘ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక్కో ప్రాంతం పట్ల ఒక్కో రకంగా వివక్ష చూపుతూ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు 2019లో ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమ’ని బీవీ రాఘవులు అన్నారు. ఎన్‌పీకుంటలో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘కోస్తాలో పట్టిసీమ కాలువల ద్వారా భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.48 లక్షలిచ్చారు. అదే ఇక్కడైతే కేవలం రూ.లక్ష ఇస్తామంటున్నారు. ఈ భూములు చంద్రబాబు అబ్బ సొత్తేంకాదు. తరతరాలుగా రైతులు సాగుచేసుకుంటున్నవి. ఎకరాకు కనీసం రూ.10 లక్షలివ్వాలి. ఇది దోపిడీ ప్రభుత్వం. రైతులను ముంచే ప్రభుత్వం. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతో పాటు భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. ఆ చట్టం అమలు చేయమని మేము రైతుల పక్షాన అడిగితే అరెస్ట్ చేస్తారా? చట్టం అమలు చేయలేని సర్కారు పెద్దలను మొదట అరెస్ట్ చేయండి’ అని ఆయన డిమాండ్ చేశారు.